సూర్యాపేట జిల్లా:బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని బీఎస్పీ చిలుకూరు మండల ఇంచార్జీ,కోదాడ నియోజకవర్గ కోశాధికారి కందుకూరి ఉపేందర్ డిమాండ్ చేశారు.బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కు గురైన వందలాదిమంది విద్యార్థులకు మద్దతుగా ఆదివారం బహుజన సమాజ్ పార్టీ అధ్వర్యంలో చిలుకూరు మండల కేంద్రంలోని ఎన్ హెచ్ 167 పై శాంతియుతంగా రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం విద్యా వ్యవస్థపై సవితి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు.
గత నెల సిద్ధిపేట మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటన మరవకముందే బాసర ట్రిపుల్ ఐటీలో జరగటం సిగ్గుచేటన్నారు.గత కొన్ని రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు చేసిన ఉద్యమానికి తలొగ్గిన ప్రభుత్వం అక్కడ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ఆహారం కల్పిస్తామని నమ్మబలికి మోసం చేసిందని దుయ్యబట్టారు.
ఆ సమయంలో యూనివర్సిటీని సందర్శించి సిల్లీ సమస్యలంటూ సింపుల్ గా కొట్టిపారేసి,ఈ సంఘటనకు కారణమైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ట్రిపుల్ ఐటీతో పాటు రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లను సందర్శించి మౌళిక సదుపాయాలు,నాణ్యమైన ఆహారం,విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
లేనిపక్షంలో బీఎస్పీ అధ్వర్యంలో విద్యార్థుల తరుపున హాస్టళ్ల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసి, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.ఈ రాస్తారోకో కారణంగా హైవే పై దాదాపు 2 కి.మీ.మేర ట్రాఫిక్ జామ్ అయింది.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొల్లేపంగు రాజేందర్,నాయకులు కందుకూరి శ్రీను, ముదిగొండ నాగయ్య,ముదిగొండ చిరంజీవి, రామతులసి,కందుకూరి నాగేష్,కందుకూరి వెంకన్న, గజ్జి వీరబాబు,నూకపంగు సాయి,మల్లేపంగు మహేష్,ముదిగొండ బాలు,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.