నల్గొండ జిల్లా:స్నేహ సమైక్య పొదుపు సంఘం పేరుతో సుమారు 3వేల మంది మహిళల నుండి దాదాపు రూ.8 కోట్ల వరకు వసూలు చేసి చివరికి సంఘం సభ్యులకు కుచ్చుటోపీ పెట్టి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో వెలుగులోకి వచ్చింది.తాము మోసపోయామని గ్రహించిన మహిళలు తమకు న్యాయం చేయాలంటూ సోమవారం మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లడుతూ పొదుపు పేరుతో కృష్ణవేణి మరి కొంతమంది కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసి, మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని కొద్ది మొత్తంలో పొదుపు చేస్తే భారీ మొత్తంలో చెల్లిస్తామని నమ్మించి పట్టణానికి చెందిన సుమారు 3 వేల మంది పేద మహిళల నుండి నెలనెలా ఏకంగా రూ.8 కోట్ల మేర వసూలు చేసి చివరికి వారికి కుచ్చుటోపీ పెట్టారని అన్నారు.నిర్వాహకులు గత 8 నెలల నుంచి సభ్యులకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా సొంత ఆస్తులు కొనుక్కున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం ఆర్డీవో, డీఎస్పీలకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బాధిత పొదుపు సంఘం సభ్యులు భారీ మొత్తంలో పాల్గొన్నారు.