సూర్యాపేట జిల్లా:బ్రతికి ఉన్నప్పుడు మనిషి ఎలా జీవించినా చనిపోయిన తర్వాత మాత్రం దహన సంస్కారం గౌరప్రదంగా చేసి అంతిమయాత్ర సాఫీగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా గు.కానీ,అలాంటి అదృష్టం మాత్రం సూర్యాపేట జిల్లా నూతనకల్( Nuthankal ) మండలంలింగంపల్లి( Lingampalli ) గ్రామ ప్రజలకు లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు.
మా గ్రామంలో చనిపోయిన వారిని దహనం చేయాలంటే సరైన స్మశాన వాటిక లేదని,ఉన్న స్థలంలో 2018 సంవత్సరం లో 8,57,525 రూపాయల అంచనా వ్యయంతో ఎమ్.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో వైకుంఠ ధామం నిర్మించినా అది ఉపయోగకరంగా లేదని
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పూర్తి లోపభూయష్టంగా నిర్మాణం చేసి వదిలేశారని,ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అందులో దహనం చేయలేదని ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, గ్రామంలో ప్రస్తుతం ఎవరైనా మరణిస్తే దహనం చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని,ఎవరికి వారు సొంత భూమిలో దహనం చేద్దామంటే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని,అయినా తమ గ్రామ సమస్యను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలోని వైకుంఠ ధామం నిర్మించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని,తిరిగి పూర్తి వసతులతో నిర్మాణం చేసేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇదే అదునుగా గ్రామానికి చెందిన ఒక పార్టీ నాయకులు అది వాస్తుకు లేదని,అందుకే దానికి కూల్చివేయాలని ప్రజలకు మాయమాటలు చెబుతున్నట్లు తెలుస్తోంది.
వైకుంఠధామం స్థానంలో ఓ కులానికి చెందిన దేవుడి గుడి కట్టాలని కుట్ర చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.