సూర్యాపేట జిల్లా: జిల్లాలో మనఊరు మనబడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలలో చేపట్టవలసిన పనుల అంచనా వివరాలను సత్వరమే అందించాలని విద్య, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని మనఊరు మనబడి కార్యక్రమంపై అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తో కలసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో మొదటి విడతగా 329 పాఠశాలలు ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగిందని, ఎంపికైన పాఠశాలల వారిగా ఎస్ఎంఎస్ కమిటీలతో మౌళిక వసతుల కల్పనపై సమావేశాలు నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.
ముందుగా ప్రభుత్వ అక్కౌంట్,దాతల అక్కౌంట్ విడిగా తీయాలని,అలాగే మిగిలి ఉన్న ఎస్ఎంఎస్ సమావేశాల ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.మనఊరు మనబడిలో ప్రభుత్వం నిర్దేశించిన 12 అంశాలకు లోబడి పనులు చేపట్టాలని అలాగే ఎంపికైన పాఠశాలలలో స్థలాలు తక్కువ ఉన్నవాటి వివరాలను ముందుగా గుర్తించి నివేదికలు అందించాలని సూచించారు.329 పాఠశాలలకు గాను 43 ఎస్ఎంఎస్ సమావేశాలు నిర్వహించడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పనులలో అలసత్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాఠశాలల్లో చేపట్టవలసిన పనుల అంచనా వివరాల నివేదికలను సత్వరమే అందించాలని అదేశించారు.తదుపరి అందచేసిన నివేదికల ఆధారంగా అదనపు కలెక్టర్లతో పాటు తాను పాఠశాలలను పరిశీలన చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి ఆదిశగా సత్వరమే మిగిలి ఉన్న పనులపై చర్యలు చేపట్టాలని అలాగే పాఠశాలల్లో కిచెన్ షెడ్స్, ప్రహరీలు,మరుగుదొడ్లు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాలని కలెక్టర్ ఈ సందర్బంగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్,ఏడి శైలజ,ఈడబ్ల్యూఐ డిసిడిఈ రమేష్,ఇంజనీరింగ్ శాఖల ఏఈలు తదితరులు పాల్గొన్నారు.