సూర్యాపేట జిల్లా:అభివృద్ధికి చిరునామా టీఆర్‌ఎస్ పార్టీ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామ సర్పంచ్ ధనియాకుల కోటమ్మ,బీజేపీ నాయకుడు ధనియాకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో రెండు వందల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుందన్నారు.రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందుందని, పెట్టుబడిదారులు హైద్రాబాద్ వైపు చూస్తున్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగే సంక్షేమ అభివృద్ధి పథకాలు తమ రాష్ట్రాలలో చేయాలని బీజేపీ పాలత రాష్ట్రాలలో డిమాండ్ రావడంతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై అక్కసు పెంచుకుందన్నారు.అభివృద్ధి పథకాలపై విషం చిమ్ముతూ ఉచిత విద్యుత్‌ను అడ్డుకునేందుకు స్వయంగా కేంద్రం మంత్రులే రంగంలోకి దిగారని ఆరోపించారు.
మోడీ మార్క్ అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకున్న గుజరాత్ రాష్ట్రంలో నిజాలు బయటపడుతున్నాయని,ప్రజలకు కనీసం ఆరు గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు.పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.పెట్రోల్,డిజిల్,గ్యాస్ ధరలను పెంచుతూ మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ అవసరాల కోసం ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు.నియోజకవర్గంలో సైతం అలాంటి వాతావరణానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తుండగా నాగులపాటి అన్నారంకు చెందిన బీజేపీ సర్పంచ్ గ్రామాభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం,మండల అధ్యక్షులు దొంగరి యుగేందర్,చెన్ను శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.