సూర్యాపేట జిల్లా: అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.
ఎం) ఇచ్చిన బ్లాక్ డే పిలుపులో భాగంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా అఖిల భారత రైతు-కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ… దేశసంపదను,సహజ వనరులను, ఆస్తులను ఆదానీ, అంబానీలకు దోచిపెడుతున్న బీజేపీ మోడీ ప్రభుత్వం, ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసి కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదా అని ప్రశ్నించారు.
జై జవాన్,జై కిసాన్ నినాదాలు ఉత్త ముచ్చటేనా అని ఎద్దేవా చేశారు.రైతే దేశానికి వెన్నెముక అంటూనే రైతు వెన్నులో తూటాలు దించిన హంతక మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.రైతులపై కాల్పులకు అదేశాలిచ్చిన హర్యానా ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి,సీఎం,హోం మినిస్టర్లపై హత్యానేరం కేసు నమోదు చేయాలని, విధుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.25 ఏండ్ల యువ రైతు శుభకరన్ సింగ్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని,దేశ ప్రజలకు మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.రైతుల సమస్యలపై చర్చించడానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని,
దేశంలో అన్నదాతలు అలమటిస్తుంటే మోడీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయం అన్నారు.వెంటనే రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ (ఎం.ఎస్.పి) చట్టం చేయాలని,రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని,కార్మిక కొత్త చట్టాలను ఉపసంహరణ చేసుకోవాలని డిమాండ్ చేశారు.లేకుంటే రైతు ఆగ్రహజ్వాలలకు బీజేపీ ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు,పి.డి.ఎస్.యు, బిఓసి,ఎస్.డి.ఎల్.సి, పివైఎల్ రాష్ట్ర,జిల్లా నాయకులు పాల్గొన్నారు.