సూర్యాపేట జిల్లా:బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం,మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబాలు బంగారు కుటుంబాలు అయ్యాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.సూర్యాపేట నియోజకవర్గంలో ఆయన చేపట్టిన హాథ్ సే హాథ్ జొడో పాదయాత్ర మంగళవారం 26వ రోజుకు చేరుకుంది.
సోలిపేట నుండి ప్రారంభమై కాసింపేట, రామ్ కోటి తండాలో పర్యటించి,ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ 1,25,000 రూపాయలు అప్పుల భారం మోపారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతదేశాన్ని కుల,మత ప్రాంత భాషల పరంగా విభజించి విద్వేషాలు సృష్టించాలని చూస్తున్నదని విమర్శించారు.రాహుల్ గాంధీ బీజేపీ కుట్రలను వ్యతిరేకించి భారతదేశాన్ని సమైక్యం చేయడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారని,రాహుల్ గాంధీ పాదయాత్ర స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర ప్రారంభించి ఇప్పటివరకు 325 కిలోమీటర్లు పూర్తి చేశామని అన్నారు.
పాదయాత్ర ముఖ్య ఉద్దేశం గ్రామాలలో మీతో పాటు తిరిగి,మీ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాటం చేయడం మా ఉద్దేశమన్నారు.