సూర్యాపేట జిల్లా:హైవేలపై ఉన్న వైన్ షాపుల వల్ల ఆక్సిడెంట్లు అవుతున్నాయని, అదేవిధంగా జనవాసాల మధ్య ఉన్న వైన్ షాపుల వల్ల ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని వెంటనే తొలగించాలని సోమవారం సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట హైవేపై ఉన్న వైన్ షాపుల వల్ల మందు బాబులు విపరీతంగా తాగి హైవే మీదకు వచ్చి వీరంగం చేస్తూ కొట్టుకుంటున్నారని అన్నారు.అదేవిధంగా హైవే మీద ప్రయాణించే వాహనాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు.
దీనివల్ల అనేక యాక్సిడెంట్స్ జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జనావాసాల మధ్య ఉన్న వైన్ షాపుల వల్ల మందు బాబులు గుంపులు గుంపులుగా ఉండి న్యూసెన్స్ చేస్తుండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ముఖ్యంగా మహిళలు అక్కడ నుంచి వెళ్లాలంటేనే భయపడుతున్నారని అన్నారు.కాబట్టి హైవే మీద,జనావాసాల మధ్య ఉన్న వైన్ షాప్ లను అక్కడి నుంచి తొలగించాలని కోరారు.
వీలైనంత త్వరలో వాటిని తొలగించకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో వాటిని తొలగించే వరకు పోరాటాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న,పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పి.డి.ఎస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ సూర్యాపేట డివిజన్ నాయకులు వీరబోయిన రమేష్ పాల్గొన్నారు.