సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామంలో మంగళవారం ఎస్సారెస్పీ కాలువలో దిగి రైతులు నిరసన వ్యక్తం చేశారు.రైతుల నిరసనకు మద్దతు తెలిపిన యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు పసుల అశోక్ యాదవ్ మాట్లాడుతూ చిట్టచివరి గ్రామాలకు నీళ్లు అందడం లేదని,ఖరీఫ్ సీజన్లో కాలువ నీళ్లను నమ్ముకుని పంటలు వేసిన రైతులు నిరాశ చెందుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.
పొట్ట దశలో ఉన్న వరిపంట నీళ్లు అందక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని,అలాగే మిగతా పంటలు వేసిన రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ వారబందీ విధానంలో రైతులకు నష్టం జరుగుతున్నదని అన్నారు.వారాబంధి అని చెప్పి గత మూడు వారాలుగా మా చిట్టచివరి గ్రామాలకు నీరు అందకుండా చేస్తున్నారని అన్నారు.
బావి,బోరు ఉన్న రైతులు కాలువ రాకపోవడంతో భూగర్భ జలాలు తగ్గి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి చిట్టచివరి గ్రామాల భూములకు నీరు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతులు బోయిని నాగయ్య,ఇరుగు వీరస్వామి,చిర్రా ఉమేష్, మొండికత్తి సైదులు,చల్ల శ్రీను,చిర్రా వెంకన్న,చిర్ర ఉప్పలయ్య,కోడి అవిలయ్య,లింగాల నారాయణ,చిర్ర మహేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.