సూర్యాపేట జిల్లా:గత నెల 11వ,తారీకున సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నిఖిల్ నాయక్ అనుమానాస్పద మృతి కేసు 40 రోజులు దాటినా ఎలాంటి పురోగతి లేకపోవడం,కుటుంబ సభ్యుల నుండీ,గిరిజన సంఘాల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఎట్టకేలకు తల్లిదండ్రుల డిమాండ్ మేరకు ఈ కేసును సీఐడీకి అప్పగించినట్లు కోదాడ,సూర్యాపేట డీఎస్పీలు వెంకట్ రెడ్డి, నాగభూషణం తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వారు వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిఖిల్ నాయక్ మృతి కేసును సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం నేతృత్వంలో పారదర్శకంగా విచారణ చేపట్టామన్నారు.ఈ కేసుకు సంబంధించి ఒక కమిటీని కూడా వేసి,పూర్తి విచారణ చేపట్టడం జరిగిందన్నారు.
నిఖిల్ తో సంబంధం ఉన్నటువంటి వారందరినీ పిలిపించి విచారణ చేయడం జరిగిందని,ఏ ఒక్క కోణంలో కూడా నిఖిల్ హత్య చేయబడ్డాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు.ఈ కేసులో నిఖిల్ తల్లిదండ్రులను కూడా విచారించడం జరిగిందన్నారు.
ఈకేసును చేధించేందుకు పోలీస్ శాఖ శతవిధాల ప్రయత్నం చేసినా కనీసం చిన్న క్లూ కూడా దొరకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదన్నారు.నిఖిల్ మరణ మిస్టరీ వీడకపోవడంతో కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు,రాస్తారోకోలు,నిరసన ప్రదర్శనలు చేశారన్నారు.
కేసు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శతవిధాల ప్రయత్నం చేశామని,అయినా ఫలితం లేకపోవడంతో నిఖిల్ తల్లిదండ్రుల కోరిక మేరకు,పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు మేరకు కేసును సిఐడి అధికారులకు అప్పగించడం జరిగిందని వెల్లడించారు.ఈ కేసు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, సాంకేతిక పద్ధతులను ఉపయోగించి పూర్తి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు.
సిఐడి అధికారులు కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ రెండు కేసుల్లో పారదర్శకంగా దర్యాప్తు జరుగుతుందన్నారు.సిఐడి వారికి జిల్లా పోలీసు శాఖ అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు.
తల్లిదండ్రులు ఏమంటున్నారు?మా కుమారుడు నిఖిల్ మృతిపై మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, కేసును పక్కదారి పట్టించేందుకు రాజకీయం జోక్యం పెరిగిందని,అందుకే కేసు దర్యాప్తు మందగించిందని,ప్రజల నుండి వచ్చిన వత్తిడి మేరకు,తాము డీజీపీని కలిసి విజ్ఞప్తి చేసిన మేరకు చివరికి సీఐడీకి అప్పగించారన్నారు.సీఐడీ అధికారులైనా కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి,నిజాలను నిగ్గుతేల్చి,హత్య మిస్టరీని చేధించి,మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.