విద్యా,వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వైద్య,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ( Minister Damodara Raja Narasimha ) అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి( Huzurnagar Hospital )ని సహచర మంత్రులైన రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖా మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలసి పరిశీలించి రోగుల వార్డులలో కలియతిరిగి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
తదుపరి ఏర్పాటు చేసిన వైద్య వసతులపై వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttamkumar Reddy ) మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని,నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలందాలని అన్నారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో మారుమూల మండలాల నుండి వచ్చే రోగులకు కార్పోరేట్ స్థాయిలో వైద్య సేవలందాలని,వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని అన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతుల కల్పన,ఏరియా ఆసుపత్రిలో కావలసిన వసతులపై ప్రతిపాదనలు సత్వరమే అందించాలని సూచించారు.

అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ( Aarogyasri ) కింద 1800 వ్యాధులకు రూ.487 కోట్లు ఖర్చు చేస్తున్నామని,అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ ని 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పోరేట్ స్థాయి వైద్యం అందాలని, అన్ని అసుప్రతులలో డైట్, శానిటేషన్,డ్రగ్స్ కొరత లేకుండా ఉంచాలని,ఏ ఒక్క పేషంట్ కూడా బయట మందులు కొనుగోలు చేయకుండా ఉండాలని,అలాగే రోగులకు సర్కార్ దవఖానాలపై విశ్వాసం పెరగాలన్నారు.ప్రభుత్వం ఇటీవల స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు అందించిందని,త్వరలో వైద్యాధికారుల నియామకాలు చేపట్టుట జరుగుతుందన్నారు.
సూర్యాపేటలో మెడికల్ కళాశాల సమస్యను త్వరలో పరిష్కరించి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు.

హుజూర్ నగర్ నుండి నేరుగా కోదాడ చేరుకున్న మంత్రుల బృందం 14వ వార్డులో రూ.26 కోట్లతో చేపట్టే 100 పడకల ప్రాంతీయ వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పం అర్హులైన పేదలకు మెరుగైన వైద్యం అందాలని,హైదరాబాద్ తరహాలో జిల్లాలోని సూర్యాపేట,హుజూర్ నగర్,కోదాడలలో అందాలని,అలాగే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత ఉండకుండా చూడాలని సూచించారు.
హుజూర్ నగర్,కోదాడలలో చెరో చోట సిటీ స్కాన్,టిఫా అల్ట్రా సౌండ్ లను మంజూరు చేస్తున్నట్లు వారంలో ఏర్పాటు చేయాలని సూచించారు.తదుపరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని పేదలకు, నమ్మకం,విశ్వసం పెరగాలని వైద్యులు ఆదిశగా సేవలందించాలని పేర్కొన్నారు.ఈ ప్రాంతంలో రెడ్లకుంట గ్రామం కింద 5 వేల ఎకరాల సాగుకు రూ.47 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచామని త్వరలో లిఫ్ట్ ప్రారభించుకుంటాని, మరికొన్ని లిఫ్ట్ ల మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Tummala Nageswara Rao ) మాట్లాడుతూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు నీరు,అలాగే రోడ్లకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించామని ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు తప్పక అమలు చేస్తామని పేర్కొన్నారు.ఆసుపత్రిల వారీగా వసతుల కల్పనపై సమీక్షించారు.
ఈ కార్యక్రమాల్లో కోదాడ ఎమ్మేల్యే నలమాద ఉత్తమ్ పద్మవతి, ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిష్టినా, కమిషనర్ అజయ్,డైరెక్టర్ ఆర్.వి.కర్ణన్,జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్,అదనపు కలెక్టర్లు సిహెచ్.ప్రియాంక, ఏ.వెంకట్ రెడ్డి,డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కోటా చలం, ఏరియా ఆసుపత్రుల పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రెడ్డి,కరుణ్ కుమార్,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు,జడ్పీటీసీలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.