వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి ప్రజావాణిలో చేసుకున్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,ఎస్.మోహన్ రావు లతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా దినోత్సవం ఘనంగా జరపాలని, దానికోసం మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి మహిళా దినోత్సవం రోజున బహుమతుల అందజేయాలన్నారు.జిల్లాలో 8 ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని,ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నాలుగు నియోజకవర్గాలలో జరుగు కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్నందున జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ వేసవి కాలంలో పశువుల కొరకు నీటి తొట్లలో నీటిని నింపాలని,అలాగే నాటిన మొక్కలను సంరక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 35, గ్రామీణాభివృద్ధి శాఖ 9, ఇతర శాఖలకు సంబంధించి 10, మొత్తం 54 దరఖాస్తులు అందాయని అట్టి వాటిని తగు చర్యలు అధికారులకు పంపించడం జరిగిందని తెలిపారు.