సూర్యాపేట జిల్లా: వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.జిల్లా టాస్క్ ఫోర్స్, తిరుమలగిరి,అర్వపల్లి పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 52 కేజీల నకిలీ పత్తి విత్తనాలు,300 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్ట్ చేయగా, అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన తనిఖీల్లో 22 కేజీల పత్తి విత్తనాలు సీజ్ చేసి,ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వీరిని జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వ్యవసాయానికి,రైతులకు నష్టం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని,నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో నకిలీ విత్తనాల నివారణ కోసం,గుర్తింపు కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా టాస్క్ ఫోర్స్ టీమ్ పని చేస్తుందన్నారు.
వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తున్నామని,గతంలో ఈ రకమైన నేరాలకు పాల్పడ్డ నిందితులపై కూడా దృష్టి పెట్టామని,అలవాటుగా నకిలీ విత్తనాల సరఫరా చేస్తూ నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ తప్పదన్నారు.అర్వపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడూరు గ్రామానికి చెందిన నిందితుడు పేర్ల వెంకన్న,
తన అన్న పేర్ల బుచ్చయ్య (పస్తుతం పరారీలో వున్నాడు)తో కలిసి అదే గ్రామానికి చెందిన కంకరబోయిన ప్రసాద్ (పస్తుతం పరారీలో వున్నాడు) వద్ద సుమారు 15 రోజుల క్రితం నకిలీ పత్తి విత్తనాలు కొంత మొత్తంలో కొనుగోలు చేసి, స్థానిక అధీకృత డీలర్ల వద్ద ఈ విత్తనాలు లభ్యం కావని,తప్పుడు ప్రచారం చేసి రైతులను నమ్మించి నకిలీ పత్తి విత్తనాలను ఎక్కువ ధరకు విక్రయించేందుకు నిందితుడు పేర్ల వెంకన్న తన ఇంటి వద్ద నకిలీ పత్తి విత్తనాలతో సిద్దంగా ఉండగా,పోలీసులు దాడి నిర్వహించగా విక్రయాలకు సిద్దంగా వున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోని నిందితుడు పేర్ల వెంకన్నను అదుపులోకి తీసుకున్నామన్నారు.