ఒక్కొక్క లిక్కర్ షాపుకు వందకు పైనే టెండర్లు...!

నల్లగొండ జిల్లా:లిక్కర్ షాపులకు టెండర్స్ కోసం యజమానులు సిండికేట్ అవుతున్నట్లు సమాచారం.ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు రెండు నెలలు ముందుగానే వైన్స్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

 More Than 100 Tenders For Each Liquor Shop , Liquor Shop-TeluguStop.com

దీంతో షాపులను దక్కించుకునేందుకు ఈ సారి రెట్టింపు పోటీ ఉండే చాన్స్ కనిపిస్తున్నది.ప్రతి మండలంలోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు,ప్రైవేటు ఉద్యోగ వర్గాలన్నీ భాగస్వామ్యం కోసం పోటీ పడుతున్నాయి.

ఇందుకు కారణం రానున్న రెండేండ్ల పాటు వరుస ఎన్నికలు ఉండడమే.అసెంబ్లీ, పార్లమెంటు,గ్రామ పంచాయతీ,ప్రాదేశిక, మున్సిపల్,కొన్ని కార్పొరేషన్ల ఎన్నికలన్నీ వరుసగా ఉన్నాయి.

హుజూరాబాద్,హుజూర్ నగర్,మునుగోడు, నాగార్జునసాగర్,దుబ్బాక ఉప ఎన్నికల్లో మద్యం ఏరులై పారిన విషయం అందరికీ తెలిసిందే.ప్రతి ఊరినీ మద్యం మత్తులో జోగేటట్లు చేశారు.

వైన్సుల్లో ఖాతాలు పెట్టి మరీ ఓటర్లకు ప్రతి రోజూ తాగించారన్న ఆరోపణలు ఉన్నాయి.ఇప్పుడిదే లిక్కర్ బిజినెస్ మూడు పూలు,పన్నెండు కాయలుగా మారనుందన్న అంచనా.లైసెన్స్ ఫీజు రూ.2 లక్షలు పోయినా సరే అదృష్టం ఉంటే లాటరీలో వస్తే పంట పండుతుందన్న భావనలో ఉన్నారు.ఒక్క దుకాణానికి కనీసం వంద దరఖాస్తులు వచ్చే చాన్స్ ఉన్నది.చాలా మండలాల్లో కనీసం రెండు, మూడు దుకాణాలు ఉన్నాయి.ఆ మండలంలోని వందలాది మందితో పాటు చుట్టుపక్కనుండే వారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.ఇంకొన్ని చోట్లయితే పక్క జిల్లాల నుంచి వచ్చి కూడా ప్లాన్ చేస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో ఒక్క మండలంలోనే నాలుగు గ్రూపులు ఏర్పడ్డాయి.ఈ సిండికేట్ గ్రూపులు కనీసం 50 దుకాణాలకు దరఖాస్తు చేయనున్నాయి.

అంటే రూ.కోటిని ముందే సమకూర్చుకుంటున్నారు.

ఒక్కొక్కరు కనీసం రూ.2 లక్షల వంతున ఒక దగ్గర పోగేసుకుంటున్నారు.గతంలో దేవరకొండ కేంద్రంగా ఏర్పడిన ఓ గ్రూపు 200 దుకాణాలకు దరఖాస్తు చేసింది.లాటరీలో కేవలం 2 దుకాణాలు మాత్రమే వచ్చాయి.మరో 8 దుకాణాలను డబ్బులిచ్చి కొనుగోలు చేసింది.అంటే 10 షాపులను మాత్రమే నడిపించారు.

ఈ దఫా అలాంటి గ్రూపుల సంఖ్య పెరిగింది.అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు ఒక్క దరఖాస్తు చేస్తే లాటరీలో ఆ షాప్ దక్కింది.అంటే రూ.2 లక్షలకే వచ్చేసింది.తానే సొంతంగా నడిపించుకోవడంతో రూ.కోట్లల్లో లాభాలు వచ్చాయి.అంతా అదృష్టం మీద ఆధారపడిన వ్యాపారంగా మారింది.రాజకీయాల్లో బిజీగా ఉండే నాయకగణం లిక్క ర్ సిండికేట్లలో చక్రం తిప్పుతున్నారు.మహబూబ్ నగర్, రంగారెడ్డి,నల్లగొండ, సూర్యాపేట,యాదాద్రి భువనగిరి,సంగారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ నుంచి వ్యాపారులు, లీడర్లు వస్తున్నారు.100 కిలోమీటర్ల దూరం వెళ్లి కూడా షాప్ నడిపేందుకు సిండికేట్ గ్రూపులు ప్లాన్ చేస్తున్నాయి.వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ప్లానింగ్ చేసుకుంటున్నారు.ప్రతి గ్రూపులోనూ గౌడ్ లను సభ్యులుగా చేర్చుకుంటున్నారు.బిజినెస్ లో లేని గౌడ్ ల పేరిట కూడా ఇతరులు దరఖాస్తు చేసుకోవడానికి ప్లాన్లు నడుస్తున్నాయి.ఈసారి రాష్ట్రమంతటా ప్రతి దుకాణానికి డిమాండ్ ఉండనుంది.గత నోటిఫికేషన్‌ వివరాల ప్రకారం తిరిగి ఇవ్వని దరఖాస్తు ఫీజు కింద రూ.1350 కోట్లు.దుకాణాల లైసెన్స్ ఫీజు కింద దాదాపు రూ.3500 కోట్లు ఆదాయం.ఈ సారి దరఖాస్తు ఫీజుల కింద రూ.2 వేల కోట్లకు పైగా లభిస్తుందని అంచనా.ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్‌ ప్రకారం గౌడ్స్‌కి 15 శాతం,ఎస్సీలకు 10 శాతం,ఎస్టీలకు 5 శాతం లెక్కన మొత్తం 2,620 మద్యం దుకాణాలల్లో 30 శాతం అంటే 786 దుకాణాలు రిజర్వేషన్ల ప్రకారం లైసెన్సులను ఎంపిక చేస్తారు.అంటే ఎస్సీలకు 262,ఎస్టీలకు 131,గౌడ్లకు 393 లెక్కన మొత్తం 786 దుకాణాలు రిజర్వేషన్ల కింద పోగా మిగిలిన 1834 దుకాణాలు మాత్రమే ఓపెన్‌ క్యాటగిరీ కింద ఉంచారు.

ఈ క్రమంలో ప్రతి దుకాణానికి అనూహ్య సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా లాభాలు రూ.కోట్లల్లో వస్తాయనుకోవడం పొరపాటేనని,బాగా అమ్మకాలు సాగినా పెట్టిన పెట్టుబడికి రూ.5 వడ్డీ కంటే ఎక్కువైతే ఆశించొద్దని ఓ బడా లిక్కర్ వ్యాపారి అభిప్రాయపడ్డారు.తనకూ షాపులు ఉన్నాయని గొప్పగా చెప్పుకోవడానికి తప్ప రూ.కోట్లు మూటగట్టుకునేది ఏం ఉండదన్నారు.ప్రతి షాప్ నుంచి అనేకమందికి పలు రకాలుగా మామూళ్లు ఉంటాయని అందరికీ తెలిసిందేనన్నారు.బిజినెస్ ఉందని చెప్పుకోవడానికి మాత్రమే ఈ రంగంలో అడుగు పెట్టాలన్నారు.ఇదే పెట్టుబడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టడం ద్వారా అధిక లాభాలను ఆర్జించొచ్చని సూచించారు.పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే మద్యం అమ్మకాలు 20 నుంచి 30 శాతం వరకు ఎక్కువని రికార్డులు చెప్తున్నాయి.

అందుకే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే లిక్కర్ బిజినెస్ కి డిమాండ్ ఉన్నది.ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలపైన వచ్చే ఆదాయం మీద ఆధారపడినట్లుగా స్పష్టంగా తెలుస్తున్నది.

రెండు నెలల తర్వాత జారీ చేయాల్సిన నోటిఫికేషన్ ని ఇప్పుడే ఇవ్వడమే సాక్ష్యం.సంక్షేమ పథకాల అమలుకు ఓ వైపు భూముల అమ్మకం,మరో వైపు లిక్కర్ ఆదాయాన్ని ఎంచుకున్నారు.

జనాభా ఆధారంగా ఆరు స్లాబుల్లో ఆబ్కారీ శాఖ లైసెన్స్‌లు జారీ చేసింది.ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.50లక్షలు,ఐదు వేల నుంచి యాభై వేలు జనాభా కలిగిన ప్రాంతాలల్లో లైసెన్స్‌ ఫీజు రూ.55 లక్షలు,50 వేల నుంచి లక్ష వరకు జనాభా కలిగిన ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.60 లక్షలు,లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా కలిగిన పట్టణాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.65 లక్షలు,5 లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా కలిగిన చోట్ల లైసెన్స్‌ ఫీజు రూ.85 లక్షలు,20 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో రూ.కోటి పది లక్షలు లైసెన్స్‌ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది.ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది.21వ తేదీన జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో డ్రా ద్వారా లైసెన్స్‌ల ఎంపిక ఉంటుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube