ఎటు చుసినా ఎక్కడ చూసినా కబ్జా కబ్జా కబ్జా.కబ్జా రాయుళ్ల కబంధ హస్తాల్లో తల్లడిల్లుతున్న భూ మాత.
ప్రభుత్వ,ప్రైవేట్,అటవీ భూమి కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా.పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు.
ప్రభుత్వం భూములకు రక్షణ కల్పించేది ఎవరు?80 లక్షల విలువగల భూమి హాం ఫట్.రెవెన్యూ అధికారుల కనుసైగల్లోనే ఈ భూమి కబ్జాకు గురి అవుతోందా?ప్రభుత్వ ఖాళీ స్థలాలకు హద్దు రాళ్లు ఎక్కడ?చుట్టూ కంచే వేసి,ప్రభుత్వ స్థలాలని ఎందుకు బోర్డు పెట్టరు?కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు ఎందుకు పట్టించుకోరు?అధికార పార్టీ అండదండలతోనే ఈ భూ దందా సాగుతుందా?హుజూర్ నగర్ నియోజకవర్గంలో అసలు ఏమి జరుగుతోంది? ఎవరూ నోరు మెద పరేందుకు?
సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గం అక్రమ వ్యాపారాలకు,అక్రమార్కులకు అడ్డాగా మారింది.ప్రభుత్వ,ప్రైవేట్,అటవీ భూములు ఏవైనా కానీ,కన్నుపడితే చాలు కబ్జా కావల్సిందే.నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తున్న కబ్జాలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా అధికార యంత్రాంగం లో చలనం లేకపోవడంతో ఈ కబ్జాల వ్యవహారంలో అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో మరో భూ కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలో సర్వే నంబర్ 204 లో 80 లక్షల విలువ గల ప్రభుత్వం భూమి కబ్జాకు గురి అవుతోందని స్థానికులు మొత్తుకుంటున్నారు.లింగగిరి గ్రామంలో 204 సర్వే నంబర్ లో 9.45 చదరపు గజాల విస్తీర్ణంలో మెగా పల్లె ప్రకృతి వనంను ఏర్పాటు చేశారు.దీనికి ఆనుకొని ఉన్న 2 ఎకరాల భూమిని కొందరు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ అండదండలతో భూమిని చదనుచేసి ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు స్థానిక మండల తహశీల్దార్ కు ఫిర్యాదు కూడా చేశారు.
ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉండడంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కబ్జారాయుళ్ల నుండి భారీగా ముడుపులు అందడంతోనే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని,అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామ ప్రజల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూములను కాపాడే అధికార యంత్రాంగం అవినీతి ఆరోపణల నుండి బయట పడాలంటే వెంటనే గ్రామంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని,ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేసి,అక్రమంగా ఆక్రమణకు ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి!!