బీజేపీ విధానాలను వ్యతిరేకించే ఒక్కటి కావాలి.ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని పోటీలో నిలపాలి.
ఆయా రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలి.ఫ్రంటు మరియు ఐక్య సంఘటన ఏర్పడాలి.
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం.కేసీఆర్ విధానాలపై పోరాటాలు ఉదృతం చేస్తాం.
-సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని.
సూర్యాపేట జిల్లా:దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరుస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలను పదే పదే విమర్శలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తటస్థ వైఖరి అవలంబించడమంటే బిజెపికి లాభం చేకూర్చడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పి ఆఫీస్ సమీపంలో గల శ్రీ విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సిపిఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బిజెపికి వ్యతిరేక అభ్యర్థిని పెట్టడం కోసం దేశ స్థాయిలో వస్తున్న స్పందన,జరుగుతున్న ప్రయత్నాలు బాగున్నాయని,ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్,కేసీఆర్ అనుసరిస్తున్న పరిస్థితి చూస్తుంటే బీజేపీ విషయంలో టిఆర్ఎస్ ను శంకించాల్సి వస్తుందన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి నివారించడం కోసం దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.దేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం అన్ని పార్టీలు కృషి చేయాలే తప్ప పార్టీల మధ్య ఉన్న సమస్యలను సాకుగా తీసుకొని బీజేపీకి లాభం చేకూర్చే విధంగా ఉండొద్దని హితవుపలికారు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా దేశవ్యాప్తంగా వ్యక్తిగతంగా మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండి బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ బిజెపికి వ్యతిరేకంగా పోరాడే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.అఖిల భారత స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయిస్తామని ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో కూటమి పెట్టి బిజెపిని ఓడిస్తామని చెప్పే విధానం సరికాదన్నారు.
ఎన్నికల ముందు ఇలాంటి ఫ్రంట్ ఏర్పాటు చేయడం మూలంగా ప్రాక్టికల్ గా ఎలాంటి ఉపయోగం ఉండదని అనుభవాలు తెలుపుతున్నాయన్నారు.ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలలో బిజెపి వ్యతిరేక ఓట్లు చీలకుండా కూటమి ఏర్పాటు చేయాలని,ఆ విధంగా గెలిచిన సీట్ల మధ్య ఐక్య సంఘటన నిర్మించాలని అప్పుడు మాత్రమే బీజేపీని నిలువరించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నిక మరియు ఆలిండియా రాజకీయాల మాటున రాష్ట్రంలోని తీవ్రమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.పోడు భూముల సమస్యలు పట్టించుకోకుండా,పట్టాలు ఇవ్వకుండా,సాగు చేసుకోడానికి అవకాశం లేకుండా చేస్తుందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు గొప్పగా ఇస్తున్నామని చెబుతూ,ఆసరా పెన్షన్లు 57 సంవత్సరాలకు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో ఎక్కడ సరిగా అమలు చేయడం లేదన్నారు.రేషన్ కార్డులు,పెన్షన్లు ఇచ్చి ఏళ్లు దాటుతున్నా నేటికీ కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వకపోడం సరికాదన్నారు.
అదేవిధంగా భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి వెబ్ సైట్ లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని,తండ్రి పేరు మీద ఉన్న భూములు కూడా కొడుకుల పేరు మీద వారసత్వంగా ఎక్కించాలన్నా తీవ్ర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.గౌరవెల్లిలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా నిర్వాసితులను ఇబ్బందులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు కేటాయిస్తే నిర్వాసితుల భూములు కోల్పోకుండా చేయవచ్చని తెలిపారు.హైదరాబాద్ నడిబొడ్డున మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో మంత్రులు,ఎమ్మెల్యేల కుమారులు ఉన్నారని ప్రచారం జరుగుతుంటే ముఖ్యమంత్రి కనీసం ప్రకటన కూడా చేయకపోవడం దుర్మార్గమన్నారు.
వరంగల్లు, హనుమకొండ జిల్లాలలో పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తుంటే నిర్బంధాలు ప్రయోగించి ఉద్యమాన్ని అణచివేయాలని చూడటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుదన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై స్థానికంగా ప్రజలను కూడగట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,ధీరవత్ రవి నాయక్, బుర్రి శ్రీరాములు,కోట గోపి,ఎలుగూరి గోవింద్, మేకనబోయిన శేఖర్ జె.నరసింహారావు, ఎం.వెంకటేశ్వరరావు,యాకలక్ష్మి, మేకనబోయిన సైదమ్మ,కొప్పుల రజిత,ఎలుగూరి జ్యోతి,పులుసు సత్యం,చినపంగి నర్సయ్య, ధనియాకుల శ్రీకాంత్,నాగారపు పాండు,పల్లా వెంకటరెడ్డి,ముత్యాలు,వట్టెపు సైదులు,బెల్లంకొండ వెంకటేశ్వర్లు,బెల్లంకొండ సత్యనారాయణ, నాయకులు ములకలపల్లి రాములు,చంద్రయ్య, కుమార్,శ్రీనివాస్,సాయికుమార్,సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.