సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో శనివారం 5 కోట్ల 18 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను సుమారు 518 మంది లబ్ధిదారులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ పథకం ద్వారా 81 కోట్ల 88 లక్షల రూపాయలు పంపిణీ చేశామని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు వెయ్యి కోట్లు,రాష్ట్రంలో 11 వేల కోట్లు తెలంగాణ ఆడపడుచులకు అందజేసినట్లు తెలిపారు.రాష్ట్రంలో ఏడు లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ.3016 చొప్పున పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనన్నారు.మన రాష్ట్రంలో చేనేత, గీత,బీడీ కార్మికులకు,బోదకాలు,ఒంటరి మహిళలకు,కిడ్నీ,ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదన్నారు.అలాగే 24 గంటల కరెంటు,రైతులకు ఉచితం కరెంటుతో పాటు,రైతుబంధు,రైతుబీమా అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని గర్వంగా చెప్పగలమన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు పరిశీలించాలని కోరారు.2014 కంటే ముందు సూర్యాపేట పట్టణం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందో చూసి ప్రభుత్వ పనితీరును పట్టణ ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తున్నది కాబట్టే నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిపించారన్నారు.అనంతరం నియోజకవర్గంలోని 4 మండలాల్లోని గ్రామాల వారీగా కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపిక,మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ,డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.