సూర్యాపేట జిల్లా:గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కోట చలం అన్నారు.సోమవారం మునగాల మండలం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కాన్పు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని,గత నెల గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు.రక్తహీనతతో భాధ పడుతున్న వారికి ప్రత్యేక వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.102 సేవలను ఆసుపత్రికి వెళ్లేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు.అసంక్రమిత వ్యాధుల వల్ల పెను ప్రమాదం ఉందని,వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు మాత్రలు పంపిణీ చేయాలని,నోరు, రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జిల్లాలోని ప్రతి ఒక్కరి వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలని సిబ్బందిని ఆదేశించారు.వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయుంచాలని అన్నారు.12 నుండి 14 సంవత్సరాల వయస్సు గల వారిని గుర్తించి కార్భివాక్స్ టీకాలు వేయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాతాశిశు సంరక్షణ అధికారి డాక్టర్ జయా,జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్,డాక్టర్ రవళి,డాక్టర్ వైష్ణవి,భాస్కర్ రాజు,ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.