సూర్యాపేట జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయాలకు ప్రత్యేకత ఉండేది.తిరుగుబాటు అనేది ఇక్కడి మట్టిలోనే ఉంటుంది.
అది తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటమైనా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమైనా,రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేయడంలోనైనా తనదైన రాజకీయం కనిపిస్తుంది.కమ్యూనిస్ట్,కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం కేరాఫ్ గా ఉండేది.
పార్టీ ఏదైనా తిరుగుబాటు అనేది మాత్రం కామన్.ప్రస్తుతం మరోసారి తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే…గత కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్, కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత వర్గపోరు నడుస్తుంది.అది కాస్త చిలికి చిలికి గాలి వానలా మారింది.
కొందరు హస్తం పార్టీ సీనియర్లు దగ్గరుండి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమను పట్టించుకోవడం లేదని కొంత కాలంగా తెగ బాధపడిపోతుంది.పార్టీని నమ్ముకుని ఉన్నవారిని కాదని, వలస వచ్చినోళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారని,పాత వారిని పాతరేశారని భగ్గుమంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ల పేరుతో ఒక వర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసింది.దీనితో అంతర్గత వర్గపోరు కాస్త ఒక్కసారిగా బహిర్గతమైంది.
దీనితో ఎమ్మెల్యే సీనియర్లను పక్కన పెట్టారని,అదే ఇప్పుడు ఈ పరిస్థితికి దారి తీసిందనే వాదన వినిపిస్తుంది.ప్రస్తుతం తుంగతుర్తి కాంగ్రెసులో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకొని,వర్గపోరు పరాకాష్టకు చేరింది.
ఎందాకంటే సొంత పార్టీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది.ఎమ్మేల్యేకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఇంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్త క్యాడర్ ఒక్కసారిగా రోడ్ ఎక్కింది.
దీనికి కారణం ఎమ్మెల్యే మందుల సామేలేనని ఆ వర్గం బలంగా వాదిస్తుంది.అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన సామేలుకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తుంగతుర్తి నియోజకవర్గం క్యాడర్ రెడ్ కార్పొట్ గా పర్చిన మాట వాస్తవం.
టికెట్ ఇప్పించిన దగ్గర నుంచి ప్రచారం,ఆర్థిక సాయం ఇలా అన్ని తామై ముందుకు నడిపించామని నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట.తీరా గెలిచిన తర్వాత సహాయం చేసిన కాంగ్రెస్ లీడర్లను కాదని బీఆర్ఎస్ నుండి వచ్చిన నేతలను చేరదీశారని,ఎమ్మెల్యే వాళ్ల పక్షాన్నే ఉంటున్నారని కొంతకాలంగా లోలోపల మదనపడ్డారు.పదేళ్లు పార్టీకి అండగా నిలబడిన నేతలను పూచికపుల్ల లాగా తీసి పడేశారని,పార్టీ అధికారంలో ఉన్నా ప్రాధాన్యత లేకుండా పోయిందని క్యాడర్ గుర్రు మీద ఉంది.దీనికి తోడు పార్టీ కార్యకలాపాలో అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరి పోయిందని అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తం అవుతుంది.
దశాబ్ద కాలం పాటు ప్రతిపక్షంలో ఉండి నిలబడితే అండగా ఉన్న నేతలను పక్కనపెట్టి తన అనుకున్నవాళ్లతో నియోజకవర్గంలో అన్ని వ్యవహారాలను చక్కబెట్టడం కూడా లోకల్ లీడర్ల ఆగ్రహానికి కారణంగా మారిందని,ఈ వ్యవహారం ముదిరి పాకాన పడేసరికి తుంగతుర్తి పాత క్యాడర్ బరెస్ట్ అయిందనేది టాక్.దగా పడిన కాంగ్రెస్ నేతల్లారా కదలిరండి అంటూ ప్రత్యేక సమావేశానికి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు యోగానందచారి పిలుపునిచ్చారు.
అయితే ఈ మీటింగ్ కి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.అయినప్పటికీ సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్నారు.పోలీసులు ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి, అరెస్టుల వరకు వెళ్ళి స్టేషన్ ముందు ధర్నా చేసే వరకు వెళ్లింది.ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మందుల సామెల్ ఆదేశాల మేరకే అరెస్టులు జరిగాయని,సొంత పార్టీ నేతలనే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించారని రెబల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా ఇంత దారుణం లేదని,సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇలా విడిపోవలసి వచ్చిందని ఆ వర్గం నేతలు చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యే మందుల సామేలు తీరుపై ఇకనైనా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాలని పాత కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.పరిస్థితి చక్కదిద్దకపోతే తమ ఫ్యూచర్ తాము చూసుకుంటామని అల్టిమేట్ ఇస్తున్నారు.
దసరా తర్వాత తాడోపేడో గాంధీభవన్లోనే తేల్చుకుంటామని చెబుతున్నారు.కాంగ్రెస్ కంచుకోటగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సెగ్మెంట్ సైడ్ ఎఫెక్టులతో పక్కదారి పడుతుంటే సీనియర్ నేతలు జోక్యం చేసుకొని వివాదాలను చర్చిస్తారా లేక కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు ఆజ్యం పోస్తారా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
.