సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో దళిత బంధు( Dalit Bandhu ) లబ్ధిదారులకు యూనిట్ల మంజూరులో జరిగిన అవినీతి,అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి( Kota Gopi ) డిమాండ్ చేశారు.ఇటీవల దళిత బంధులో జరిగిన అవినీతిపై ఎలక్ట్రానిక్ మీడియా( Electronic media )లో వచ్చిన వార్తల నేపథ్యంలో కెవిపిఎస్ జిల్లా బృందం గ్రామాన్ని సందర్శించి దళిత బంధు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం యూనిట్ల మంజూరులో అవకతవకలు భారీగా జరుగుతున్నయన్నారు.
గుడిబండ గ్రామంలో ఇటీవల 99 మందికి దళిత బంధు యూనిట్లు మంజూరు చేయగా ఒక్కొక్క లబ్ధిదారుల నుంచి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఆ గ్రామానికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు బలవంతంగా వసూలు చేశారని,డబ్బులు ఇవ్వలేని లబ్ధిదారుల నుండి అగ్రిమెంట్లు రాయించుకొని యూనిట్ల మంజూరీలో బర్రెలు కొనుగోలు చేసిన వారి నుండి రెండు లక్షల రూపాయల కింద లబ్ధిదారులతో పంచాయితీ పెట్టుకొని బర్లను కొనుగోలు చేసిన కేంద్రాల నుండే బలవంతంగా తీసుకుని వెళ్లారని ఆరోపించారు.
అధికార పార్టీ నాయకులు దళితుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు.గ్రామానికి చెందిన మండల ప్రజా ప్రతినిధి తన యొక్క అనుచరులను దళారులుగా,ఏజెంట్లుగా పదిమంది లబ్ధిదారులకు ఒకరు చొప్పున నియమించి డబ్బులు వసూలు చేశారని తెలిపారు.
ఈ గుడిబండ లబ్ధిదారుల అవినీతి అక్రమాలలో స్థానిక శాసనసభ్యుడి పాత్ర కూడా ఉందన్నారు.ఇటీవల ముఖ్యమంత్రి ఆయా నియోజకవర్గాలలో దళిత బంధు లబ్ధిదారుల నుండి అవినీతికి పాల్పడి డబ్బులు వసూలు చేశారని అలాంటి వారి జాబితా తన వద్ద ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ కోదాడలో ముఖ్యమంత్రి మాటలను లెక్కచేయకుండా ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు ఈ విధంగా డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నించారు.
వెంటనే ఈ అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి లబ్ధిదారులు ఇచ్చినటువంటి డబ్బులను దళారుల నుండి వసూలు చేసి తిరిగి వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు.లేనియెడల కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళితులందరిని సమీకరించి జిల్లా కలెక్టరేటరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు సాయి, మరియన్న మరియు గ్రామ దళితులు పాల్గొన్నారు.