సూర్యాపేట జిల్లా: సోల్జర్స్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన 225 మంది యువకులలో ఉమ్మడి జిల్లాకు చెందిన 43 మంది అగ్నివీర్ కు ఎంపికవడం ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ది సోల్జర్స్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగ్నివీర్ సోల్జర్స్ కి మరియు వారి తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ మన ప్రాంతం నుండి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ విదేశీ శక్తుల నుండి మన దేశాన్ని కాపాడడం తమవంతు బాధ్యతగా విధులు నిర్వహించడానికి ముందుకు వచ్చిన ఈ సైనికులకు, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు దేశ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని అన్నారు.ఈ అగ్నివీరులు రాబోయే తరంలో చాలామంది యువతీ యువకులకు మార్గదర్శకులు అవుతారని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తనవంతు సహాయ,సహకారాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.డాక్టర్ సుంకర శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్ రావు, నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్,అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్,వీర జవాన్ సంతోష్ బాబు తండ్రి బిక్కమల్ల ఉపేందర్, ట్రైనర్ రాజేష్,ది సోల్జర్ యూత్ ఫౌండేషన్ డైరెక్టర్ సుమన్,ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్లు, అగ్నివీర్ సైనిక్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.