ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఒక లైన్‌మెన్ చేసిన పనికి పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి.హెల్మెట్ పెట్టుకోలేదని తనకు ఫైన్ వేశారని కోపంతో ఏకంగా ఆ పోలీస్ స్టేషన్‌కే ఉన్న అక్రమ కరెంట్ కనెక్షన్‌ను కట్ చేసేశాడు.
సవాయిజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది.లైన్‌మెన్ కరెంట్ తీసేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే, ఉపేంద్ర యాదవ్ అనే లైన్‌మెన్ డ్యూటీలో భాగంగా కరెంట్ లైన్లను చెక్ చేస్తున్నాడు.అదే టైమ్‌లో పోలీసులు అటువైపు వచ్చారు.ఉపేంద్ర యాదవ్‌కు హెల్మెట్ లేదు.ఎందుకని ఆపి ప్రశ్నించారు.
లైన్లు చెక్ చేసేటప్పుడు హెల్మెట్ తీయాల్సి వస్తుందని, అందుకే పెట్టుకోలేదని ఉపేంద్ర చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.వెంటనే ఫైన్ వేసేశారు.
దీంతో తీవ్రంగా హర్టయిన ఉపేంద్ర యాదవ్ ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నాడు.పోలీసులు ఫైన్ వేశారు సరే, అసలు ఆ పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కనెక్షన్ లేదని, దొంగచాటుగా “కటియా” (అక్రమ కనెక్షన్) వేసుకొని వాడుకుంటున్నారని గుర్తించాడు.
ఇంకేముంది, తనకు ఫైన్ వేసిన పోలీసులకే బుద్ధి చెప్పాలనుకున్నాడు.వెంటనే రంగంలోకి దిగి, ఆ అక్రమ కరెంట్ కనెక్షన్‌ను పీకేశాడు.
అంతే, పోలీస్ స్టేషన్ మొత్తం చీకటిమయం అయిపోయింది.
ఈ విషయంలో విద్యుత్ శాఖ అధికారులు లైన్‌మెన్ ఉపేంద్ర యాదవ్‌కే మద్దతు పలికారు.చట్టం అందరికీ సమానమేనని, పోలీసులు కూడా అతీతులు కాదని స్పష్టం చేశారు.జూనియర్ ఇంజనీర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.“చట్టం అందరికీ ఒక్కటే కదా.మేం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం.కానీ హెల్మెట్ పెట్టుకుని కరెంట్ లైన్లు చెక్ చేయడం చాలా కష్టం.పైగా, ఇక్కడ పోలీసులే కరెంట్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు.అక్రమ కనెక్షన్ వాడుతున్నప్పుడు దాన్ని తీసేయడం సరైన పనే కదా” అని లైన్‌మెన్‌ను వెనకేసుకొచ్చారు.ఆ సవాయిజ్‌పూర్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కొత్తది.
దానికి ఇంకా అధికారికంగా కరెంట్ మీటర్, కనెక్షన్ రాలేదు.అందుకే, పోలీసులు ఇలా దొంగ కరెంట్‌తో నెట్టుకొస్తున్నారట.
ఈ ఘటనతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చట్టాలను కాపాడాల్సిన వాళ్లే ఇలా కరెంట్ దొంగతనానికి పాల్పడటం ఏంటని నెటిజన్లు, స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.