సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రం నడిబొడ్డున 20 రోజుల క్రితం అగ్రవర్ణానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించాడనే నెపంతో యువ అడ్వకేట్ ధరావత్ నిఖిల్ నాయక్ ను దారుణంగా హత్య చేసి మునగాల వద్ద సాగర్ ఎడమ కాలువలో పడి వేయడం జరిగిందని,సంఘటన జరిగి 24 రోజులైనా విచారణ జరగకుండా, నిందితులను పట్టుకోకుండా పోలీసులు కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని,కుటుంబ సభ్యులు ముమ్మాటికి ఇది హత్య అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు,రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు న్యాయం చేయాలనీ ఫిర్యాదు చేయడం జరిగింది.అయినా ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం గిరిజన, బంజారా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యలో శాంతియుత ర్యాలీ,నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు గిరిజన నేతలు నిఖిల్ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు నిందితులను వెంటనే పట్టుకొని చట్టపరమైన శిక్ష విధించాలని,రాబోయే రోజుల్లో కుల హత్యలు పరువు హత్యలు జరగకుండా నూతన చట్టాలు రావాలని డిమాండ్ చేశారు.
నిఖిల్ నాయక్ కేసు విషయంలో ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి,సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ డిమాండ్ చేశారు.