సూర్యాపేట జిల్లా:జిల్లాలో నాటుసారా తయారు చేసే వారిపై నిఘా ఉంచి నాటుసారా లేకుండా పోలీసు,ఎక్సైజ్ శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఆదేశించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్ రెడ్డి,సూర్యాపేట జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్ తో కలిసి పోలీసు,ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయని,చాలా కుటుంబాలు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు.నాటుసారా మూలాలను తొలగించి,పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయని, జిల్లాలో నాటుసారాను పూర్తిగా నిర్మూలించడం కోసం అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
సారాయి తయారు చేసే గ్రామాలు,తండాలు, వ్యక్తులను,హాట్ స్పాట్స్ ను గుర్తించాలన్నారు.పాత నేరస్తులపై నిఘా ఉంచి,సారాయి తయారీకి అవసరమైన సామాగ్రి బెల్లం,పట్టిక ఎక్కడ నుండి వస్తుందో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు.గత ఎన్నికల సమయంలో సారాయి, బెల్లం,పట్టిక కేసుల్లో ఉన్న వ్యక్తులను బైండోవర్ చేసి మళ్ళీ ఇలాంటి నేరం చేయకుండా అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా సంయుక్తంగా తనిఖీలు చేయాలని, గుడుంబా రహిత జిల్లా కోసం అందరూ కలిసి కృషి చేయాలని,జిల్లా సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు.ఈ సమావేశంలో డిఎస్పీ రవి, శ్రీధర్ రెడ్డి,డిసిఆర్బీ డిఎస్పీ మట్టయ్య,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ ఇనస్పెక్టర్లు పాల్గొన్నారు.