కరెంట్ బిల్లే షాక్ కొడుతోంది

సూర్యాపేట జిల్లా:వణికిపోతున్న వినియోగదారులు, రీడింగ్ వచ్చిన బిల్లు రూ.1947,ఆన్ లైన్ లో చూపే బిల్లు రూ.81,131,మొత్తం కట్టాల్సిందే అంటున్న కౌంటర్ క్యాషియర్,లబోదిబోమంటున్న వినియోగదారుడు,అంతా మాములే అంటున్న విద్యుత్ అధికారులు,విద్యుత్ మంత్రి ఇలాకాలో విచిత్రాలు.కరెంట్ తీగలు పట్టుకుంటేనే షాక్ వస్తుందనుకుంటే ప్లెగ్ లో ఫింగర్ పెట్టినట్లే.

 The Current Bill Is Shocking-TeluguStop.com

పేటలో కరెంట్ బిల్లు చూసినా హై హోల్టేజ్ పవర్ షాక్ తగలడం ఖాయం.ఏంటి నమ్మకం కుదరడం లేదా? అంత సీన్ లేదులే అని కొట్టిపారేస్తున్నారా? అయితే మీకు సూర్యాపేటలో ఓ గృహ విద్యుత్ వినియోగదారుడికి ఆన్ లైన్ చూపిస్తున్న కరెంట్ బిల్లును చూపెట్టాల్సిందే.అది చూస్తే పట్టపగలు చుక్కలు కాదు,ఏకంగా ఉరుములు మెరుపులు,పిడుగులు కూడా కనిపిస్తాయి.వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 30 వ,వార్డులో చెట్టుపూల యాదగిరి,ఆండాలు దంపతులు నివసిస్తారు.

గృహ అవసరాల నిమిత్తం అందరిలాగే విద్యుత్ మీటర్ కనెక్షన్ కట్టుకున్నారు.వారి ఇంటికి 4140116110 సర్వీస్ నెంబర్ గల మీటర్ ను బిగించారు.

ప్రారంభంలో ప్రతి నెలా నాలుగు,ఐదు తేదీలలో బిల్లు కోసం మీటర్ రీడింగ్ చేసేవారు.అప్పుడు రూ.1100 నుండి రూ.1500 వందల వరకు ప్రతి నెలా బిల్లు వచ్చేది.ఆ తర్వాత ప్రతి నెలా 10 వ,తేదీ లోపు బిల్లు తీయడం మొదలుపెట్టారు.దీనితో స్లాబ్ లెవల్స్ పెరిగి అదనంగా బిల్లు వచ్చేది.సంబంధిత విద్యుత్ అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పకుండా దాట వేయడంతో సరేలే అని సరిపెట్టుకున్నారు.ఏప్రిల్ నెల బిల్లు మే 9 వ,తేదీన రీడింగ్ తీశారు.ఒకేసారి రూ.400 పైచీలుకు బిల్లు పెరిగి రూ.1947 బిల్లు వచ్చింది.సమ్మర్ సీజన్ కదా అని సర్దిచెప్పుకొని బిల్లు కట్టడానికి వెళ్లారు.

ఇక్కడి వరకు అంతా సాఫీగానే సాగిందని అనుకుంటున్నారా!అసలు కథ ఇక్కడే అడ్డం తిరిగింది.రీడింగ్ లో తీసిన బిల్లు రశీదు తీసుకెళ్లి కౌంటర్ లో ఇస్తే ఆన్ లైన్ చెక్ చేసిన క్యాషియర్ కి మతి పోయినంత పనైంది.రీడింగ్ రశీదులో రూ.1947 ఉంటే ఆన్ లైన్ లో రూ.81,131లు చూపించింది.మీ బిల్లు రూ.1947 కాదు,రూ.81,131 ఉందని చెప్పగానే హై హోల్టేజ్ పవర్ లైన్ పట్టుకున్నంత షాక్ తగిలింది.అదేంటండి రీడింగ్ తీసిన బిల్లు కట్టుకోండి అంటే,లేదు లేదు ఆన్ లైన్ చూపిస్తున్న బిల్లు అయితేనే కట్టుకుంటాం లేదంటే కట్టుకోమని తెగేసి చెప్పడంతో బాధిత వినియోగదారుడికి గుండెల్లో గునపం దించినట్లైంది.ఇదెక్కడి పాపామని లబోదిబోమంటే,అది మాకు తెల్వదు,మొత్తం ఇస్తే ఇవ్వు లేదంటే వెళ్ళు అని చెప్పడంతో ఏం చేయాలో తెలియక విద్యుత్ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నాడు.

రీడింగ్ బిల్లును,ఆన్ లైన్ లో ఉన్న బిల్లును చూసిన సదరు విద్యుత్ అధికారులు రీడింగ్ తీసిన సిబ్బంది పొరపాటు అయి ఉంటుంది.లేదా ఆన్ లైన్ టెక్నీకల్ సమస్య కావచ్చని తాపీగా సమాధానం ఇచ్చారు.

మరి ఇప్పుడు ఏం చేయాలని అడగగా మూడు నాలుగు రోజుల్లో సమస్య క్లియర్ కావచ్చని చెప్పటం గమనార్హం.ఈ సందర్భంగా వినియోగదారుడు మాట్లాడుతూ సమయానికి బిల్లు కట్టకపోతే ఫైన్ వేస్తారని,ఈ విషయమై అధికారులు చొరవ తీసుకుని తగు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

ఇదే విషయమై విద్యుత్ అధికారుల వివరణ కోరగా కరెంటు బిల్లుల రీడింగ్ చేసే వ్యక్తి స్కాన్ చేయడంలో పొరపాటు వలన బిల్లు అధికమొత్తంలో రావడం జరిగిందని,మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు లక్షలకు పైగా విద్యుత్ కలెక్షన్లు ఉన్నాయని తెలుస్తోంది.ఎన్నడూ లేనివిధంగా ఈ నెల నుండి ఒక్కొక్క వినియోగదారు నుండి రూ.100 అదనంగా వసూలు చేస్తున్నట్లు రీడింగ్లో తీసిన బిల్లులో కనిపించడం విశేషం.అసలే ఒకవైపు వేసవికాలంలో ఉక్కపోతలకు తట్టుకోలేక కరెంట్ వాడకం పెరిగి బిల్లుల మోత మోగుతుంటే,సందట్లో సడేమియా లాగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు మరోవైపు కస్టమర్ పై సర్ చార్జీ,సర్వీస్ చార్జీల పేరుతో ఆదనపు డబ్బులు వసూలు చేయడం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.ప్రతీ నెల 30 రోజుల్లోపు మీటర్ రీడింగ్ తీయాల్సి ఉండగా, 5,10 తేదీలలో రీడింగ్ తీయడంతో స్లాబ్ లెవల్స్ మారి అధిక బిల్లులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

సాక్షాత్తు విద్యుత్ శాఖా మంత్రి ఇలాకలోనే విద్యుత్ అధికారుల విచిత్రాలు చూసి వినియోగదారులు పరేషాన్ అవుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ వినియోగంలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించి,వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube