సూర్యాపేట జిల్లా:సెప్టెంబర్ 17 తెలంగాణ జాతి సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ జాతి సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో 15 వేల మందితో భారీ సమైక్యతా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్ తెలిపారు.గురువారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలిసి జిల్లా కేంద్రంలో ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ర్యాలీ మార్గాన్ని,సభా ప్రాంగణాన్ని,సహపంక్తి భోజనాల ఏర్పాట్లను పర్యవేక్షణ చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అత్యధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినదని, జిల్లా కేంద్రంతో పాటుగా అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో ఈ సమైక్యతా ర్యాలీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.ప్రజలందరూ ర్యాలీలో పాల్గొని జాతి సమైక్యతను ప్రదర్శించాలని,తెలంగాణ ఉద్యమ చరిత్రను,తెలంగాణ ఉద్యమకర్తల జీవితాలకు సంబంధించిన వివరాలను భావితరాలకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో,డిఎస్పీ,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.