చేతబడి నెపంతో వృద్ధుడిపై దాడి.తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలింపు.
అధిక రక్తస్రావంతో మార్గమధ్యలో మృతి.సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన.సూర్యాపేట జిల్లా:ప్రపంచం శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు తీస్తున్న రోజుల్లో ఇంకా అనేక మంది అమాయక ప్రజలు అజ్ఞానమనే అంధకారంలో చిక్కుకొని మూఢత్వమనే మూర్ఖత్వంలో మగ్గిపోతున్నారు.నాగరికులమని గొప్పలు చెప్పుకుంటూ అనాగరికం వైపు అడుగులు వేస్తున్నామని చెప్పడానికి సమాజంలో చేతబడి, బాణామతి,చిల్లంగి,భూత వైద్యం అనే పేరుతో జరుగుతున్న దారుణాలే నిదర్శనం.
నిరక్షరాస్యతతో, అజ్ఞానంతో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారు కొందరైతే,అక్షరజ్ఞానం ఉండి కూడా అజ్ఞానాంధకారంతో మూఢ నమ్మకాలను పెంచిపోషించే వారు ఇంకొందరు.ఇలాంటి దారుణాలు సమాజంలో కోకొల్లలుగా జరుగుతున్నా వాటిని అరికట్టే చర్యల్లో భాగంగా పాలకులు కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం,విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించకపోవడంతో శతాబ్దాలు మారినా మనిషిలోని మూఢత్వం తొలగిపోవడం లేదు.
దీనితో దేశంలో అనేక మంది అమాయకుల ప్రాణాలు నిత్యం ఎక్కడో ఓ చోట గాల్లో కలిసిపోతున్నాయి.ఈ మరణకాండలో అయినవారు,కానివారు,బంధువులు అనే తేడా లేదు.ఒక్కసారి అనుమానం వచ్చిందంటే చాలు అంతే సంగతులు.వారిని సామాజికంగా,మానసికంగా, శారీరకంగా నానా ఇబ్బందులు పెడతారు.
చివరికి రాక్షసంగా భౌతిక దాడులకు దిగి నరికి చంపుతారు.కానీ,అది అంతటితో ఆగదు.
మళ్ళీ మరో చాదస్తం పురుడుపోసుకుంటుంది.మరో ప్రాణం పోతుంది.
నిత్యం కంప్యూటర్ తో కలసి సహజీవనం చేస్తున్న మనిషి మెదడు మూఢత్వానికి లోను కావడం,తోటి మనిషి ప్రాణాలు తీసేందుకు వెనుకాడక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.గతంలో జరిగిన ఘటనలపై పాలకులు ఉక్కుపాదం మోపితే,కఠినాతి కఠినమైన చట్టాలు చేస్తే,అసలు అలాంటి మూఢ నమ్మకాలు ఉండవనే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళితే సమాజంలో మార్పు సాధ్యపడొచ్చు.
లేకుంటే చంద్రమండలం మీదికి వెళ్లినా చేతబడి పేరుతో హత్యలు జరగడం తప్పదేమో?!ఇలాంటి దారుణమైన మూర్ఖత్వపు ఘటనే ఆదివారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం పాడియతండ అనే గిరిజన గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.ఈ గ్రామంలో చేతబడి అనే ఓ మూఢ నమ్మకానికి బంధువుల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం పాడియతండ గ్రామానికి చెందిన వడిత్య ఖీర్య నాయక్(65)తండ్రి ఆలియ నాయక్ అనే వృద్ధుడికి మంత్రాలు(చేతబడి) వస్తాయని పాలివాడు అయిన వడిత్య బాలాజీ నాయక్ తండ్రి మంగణ నాయక్ కు అనుమానం ఉండేది.ఆ అనుమానం కాస్త పెరిగి పెద్దదై మూఢత్వంగా మారింది.
ఈ నేపథ్యంలో వడిత్య బాలాజీ నాయక్ అనేకసార్లు వడిత్య ఖీర్య నాయక్ తో గొడవపడేవాడు.గతంలో రెండు మూడు సార్లు గొడవపడి,హత్య చేయడానికి కూడా ప్రయత్నాలు చేశాడు.
కానీ,సాధ్యపడలేదు.అయినా తనలోని మూర్ఖత్వం పోలేదు.
తనను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని అవకాశం కోసం ఎదురుచూసేవాడు.క్రమంలో ఆదివారం తేదీ:29.05.2022 న ఉదయం 7 గంటల సమయంలో వడిత్య ఖీర్య నాయక్ తన ఇంటి వద్దనుండి బజారుకు వెళుతూ భూక్యా బాశ్య నాయక్ ఇంటి దగ్గరకు రాగానే ఒంటరిగా వెళ్ళడం చూసిన వడిత్య బాలాజీ నాయక్ ఇదే చంపటానికి సరైన సమయమని భావించి,వడిత్య ఖీర్య నాయక్ పై ఒక్కసారిగా దాడికి దిగి,గొంతు పిసికి,రాయితో ముక్కుపై,మొహంపై బలంగా కొట్టి చనిపోయాడని నిర్ణయించుకొని అక్కడినుండి వెళ్ళి పోయాడు.గాయాలతో పడిఉన్న వడిత్య ఖీర్య నాయక్ ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితిని పరీక్షించిన వైద్యులు మెరిగైన చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడంతో కామినేనికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.మృతుడు వడిత్య ఖీర్య నాయక్ కు ముగ్గురు కొడుకులు,ఐదుగురు కూతుళ్ళు ఉన్నారు.
మృతుని పెద్ద కుమారుడు వడిత్య పీక్య నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలకవీడు ఎస్ఐ వై.సైదులు కేసు నమోదు చేయగా,హుజూర్ నగర్ సిఐ వై.రామలింగారెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.