సూర్యాపేట జిల్లా:వృద్ధులైన తల్లిదండ్రుల వద్ద కొంత ఆస్తి,బ్యాంక్ లో నగదు ఉండడంతో ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం పన్నిన కూతురు కొంతకాలం పాటు అమ్మానాన్నలను తాను చూసుకుంటానని నమ్మించి కొడుకు దగ్గర నుండి తీసుకెళ్లి, తల్లిదండ్రులకు తెలియకుండా ఆస్తిని కాజేసి,అవసరం తీరాక కన్నవారనే కనికరం లేకుండా బయటికి నెట్టేసిన అమానవీయ సంఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది.స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన గురువోజు గోపయ్యకు ఇద్దరు కుమారులు,ఇద్దరు కూతుళ్ళు మొత్తం నలుగురు సంతానం.
ఇద్దరు కూతుళ్ళకు కట్నకానులతో వివాహం చేసిన అనంతరం కొంత ఆస్తిని కూడా ఇవ్వడం జరిగింది.చిన్న కుమారుడు ఇటీవలే మృతి చెందాడు.
వృద్ధ దంపతుల పేరు మీద 1 ఎకరం 12 గుంటల పొలం ఉన్నది.అలాగే వారి సంరక్షణకోసం బ్యాంకులో రూ.
ఒకలక్ష 6వేలు పిక్సీడ్ డిపాజిట్ చేసి,పెద్ద కొడుకు సోమయ్యచారి తల్లిదండ్రుల సంరక్షణ చూసుకుంటున్నాడు.అయితే వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు కొంతకాలం పాటు తాము చూస్తామని మంచితనంతో నమ్మించిన గోపయ్య పెద్ద కుమార్తె పూలమ్మ,చిన్న కుమార్తె కట్టుకోజు పద్మ మరియు ఆమె కొడుకు నాగరాజు వారి ఇంటికి తీసుకెళ్లారు.
అనంతరం వారికి మాయమాటలు చెప్పి,పెద్ద కొడుకుపై లేనిపోని అపోహలు కల్పించి,సంవత్సర కాలంగా కొడుకు దగ్గరకు రాకుండా చేశారు.ఇదే అదునుగా వికలాంగుల పెన్షన్ ఇప్పించే నెపంతో వారి సంతకాలు పెట్టించి,1ఎకరం 12 గుంటల పొలం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని డూప్లికేట్ పాసుపుస్తకాలు సృష్టించారు.
అంతేకాకుండా బ్యాంకులో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్ కు సంబంధించిన ఒరిజినల్ బాండ్ పేపర్ లేకుండా చేసి, కన్నవాళ్ళు అనే కనికరం లేకుండా బయటికి గెంటేశారని పెద్ద కుమారుడు సోమయ్య చారి ఆరోపించారు.తమ భూమిని,బ్యాంకులో దాచిన సొమ్ముని స్వాహా చేసిన చిన్న కుమార్తె తమని నడి రోడ్డుపై వదిలేశారని,తమకు న్యాయం చేయాలంటూ వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్, ఆర్డీఓను వేడుకుంటున్నారు.
వృద్ధులైన తల్లిదండ్రులను మోసం చేసి అక్రమంగా పట్టా చేసుకున్న భూమిని తిరిగి తమ తల్లితండ్రులకు వచ్చేలా చేసి న్యాయం చేయాలని పెద్ద కుమారుడు కోరుతున్నారు