నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గంలో కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిథుల అవినీతికి మునిసిపాలిటీలో జరిగిన సంఘటన నిదర్శనమని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు.రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం మునిసిపల్ చైర్మన్ లక్షల రూపాయలు వసూలు చేసినట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ నకిరేకల్ మున్సిపల్ కేంద్రంలో స్థానిక ప్రజాప్రతినిధులు,ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు.
ఇక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే దారిలోనే నడుస్తున్నారని, అవినీతిపై ప్రశ్నించిన కౌన్సిలర్లను బుజ్జగించేందుకు టూర్లకు తీసుకెళ్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.నకిరేకల్ మునిసిపల్ కౌన్సిలర్లు ఎక్కడున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.
మున్సిపల్ కార్మికులు మూడు నెలల నుంచి కనీసం జీతాలు లేక ఇబ్బంది పడుతుంటే పట్టించుకునే వారే లేరన్నారు.ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు పూర్తిగా పక్కదారి పట్టారని,ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఎద్దేవా చేశారు.
అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకుంటున్నఎమ్మెల్యే ఈ విషయంపై బహిరంగ విచారణ చేయించుకొని తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు.అసలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మునిసిపాలిటీ అభివృద్ధి కోసం తీసుకువచ్చిన నిధులు దేనిమీద ఎంత ఖర్చు చేశారో ప్రజలకుచెప్పాలన్నారు.
డ్రైనేజీలు, సిసి రోడ్లు శంకుస్థాపనలతో సరిపెట్టడం అభివృద్ధా అని ప్రశ్నించారు.చిరుమర్తి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నకిరేకల్ లో చేసిన అభివృద్ధి ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేతో బహిరంగ చర్చకు బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని, చర్చకు రావాలని సవాల్ విసిరారు.ఈకార్యక్రమంలో బీఎస్పీ నేతలు గద్దపాటి రమేష్,రామన్నపేట మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, మల్లేష్,వినయ్,చింటూ, మహేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.