సూర్యాపేట: దళిత బంధు లబ్ధిదారులనుండి కమీషన్లు తీసుకోవడం ఎమ్మార్పీఎస్,అఖిలపక్ష పార్టీల నాయకులపై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడడం,ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన న్యాయవాది యుగేందర్ పై అమానుష దాడికి నిరసనగా నేడు తిరుమలగిరిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించాలని భావించి, ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న నియోజకవర్గంలోని అఖిలపక్ష,ప్రజాసంఘాల నాయకులను,మహిళలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని,ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలలో భాగమేనని,
దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.దళిత బంధులో జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయనే భయంతోనే ఈ రోజు అఖిలపక్షాల సమావేశం జరగకుండా స్థానిక ఎమ్మెల్యే కుట్ర పన్ని సమావేశాన్ని అడ్డుకుంటున్నారన్నారు.
గాదరి కిషోర్ దళితబంధులో ఎటువంటి అవినీతి జరగలేదని సన్నాయినొక్కులు నొక్కుతున్నారని,అవినీతి, అక్రమాలు జరగనపుడు సమావేశాన్ని జరగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని, ఎందుకు అకారణంగా ప్రతిపక్ష నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారో ప్రజలకు ముఖ్యంగా దళిత బంధువులకు గాదరి కిషోర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ అరెస్టులకు భయపడేది లేదని,ఈ ఆందోళన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తం చేసి, దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, న్యాయవాది యుగేందర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమని తెలిసి బీఆర్ఎస్ నాయకులు ఇటువంటి అక్రమాలకు,అమానుష భౌతికదాడులకు దిగుతున్నారని,వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.