ముందుగా అటవీ భూములోని రాళ్లు తరలింపు.ఆపైన యథేచ్ఛగా భూ ఆక్రమణలు.
చోద్యం చూస్తున్న అటవీశాఖ అధికారులు.
సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండలం జాన్ పహాడ్ (నల్లరేగడి)రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో నయా దందా మొదలైంది.ఇంతకు ముందు అటవీ భూముల్లో చెట్లను నరికి భూములను ఆక్రమించుకొనే వారు.జరగాల్సిన నష్టం జరిగాక నిద్ర మత్తును వీడిన అటవీ అధికారులు అడవిలోకి కట్టెల కోసం రానివ్వకుండా చర్యలు చేపట్టారు.
దీనితో అక్రమార్కులు కొత్త మార్గాలను ఎంచుకున్నారు.అటవీ భూముల్లో లభించే రాళ్ల కోసమంటూ అడవిలోకి చొరబడి అక్రమంగా రాళ్లను వేరుకుంటూ,ఆ ప్రాంతంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
అడవిలో అంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే ఈ ప్రాంతం సుమారు 50 ఎకరాల మేర భూమి కబ్జాకు గురైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అటవీ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులు అటవీ సంపదను ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నారు.ఇదిలా వుంటే కొంతమంది అటవీ శాఖ అధికారులు అక్రమదారులకు లోపాయికారంగా సహకరిస్తున్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి.
ఇప్పటికైనా జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారులు ఈ ప్రాంతంపై దృష్టి సారించి అడవిని,అటవీ సంపదను,అటవీ భూములను సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.