సూర్యాపేట జిల్లా:కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్తని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు.వామపక్ష ప్రజాతంత్ర సంఘటనపై దృష్టి సారించి,శాస్త్రీయ దృక్పథంతో ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాసంఘాల జిల్లా బాధ్యుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.దేశవ్యాప్తంగా మితవాద ధోరణులు పెరుగుతున్నాయన్నారు.
ప్రాంతీయ పార్టీల ధోరణులను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నామని తెలిపారు.బీజేపీ మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోందని,లౌకిక శక్తులను కూడగట్టడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు.
గ్రామీణ వ్యవసాయేతరులను సంఘటితం చేయాలన్నారు.నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విద్యావిధానంపై దృష్టి సారించాలన్నారు.
సాంస్కృతిక రంగం ఆలోచనా విధానంలో మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణం ఆవశ్యకతను వివరించారు.
సమస్యలపై ఐక్య పోరాటాలను విస్తృతం చేయాలని సూచించారు.బూర్జువా పక్షాలు శాశ్వత ప్రాతిపదికన ఏ అంశాన్ని అమలు చేయవని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజాసంఘాలను బలోపేతం చేసి స్థానిక ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.లౌకికతత్వం,విద్యా, వైద్యం,ఉద్యోగాల కల్పనకు కమ్యూనిస్టుల బలోపేతం అవసరమన్నారు.
అటువంటి కమ్యూనిస్టులు లేకుండా దేశానికి భవిష్యత్తు లేదన్నారు.ఓట్లు,సీట్లు ఎన్నికలప్పుడే కానీ,ప్రజా పోరాటాలు నిర్విరామంగా కొనసాగాలన్నారు.
గత నాలుగేళ్లలో పార్టీ నిర్వహించిన పోరాటాలతో పాటు రాబోయే మూడేళ్ల రాజకీయ విధానంపై వివరించారు.సోషలిజమే ప్రపంచానికి పరిష్కారమని సూచించారు.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవింద్,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న,ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ,డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జిల్లపల్లి నరసింహారావు,సిఐటియు నాయకులు చెరుకు యాకలక్ష్మి,మేకనబోయిన శేఖర్,మామిడి సుందరయ్య,ఆఫీస్ కార్యదర్శి చిన్నపంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.