సూర్యాపేట జిల్లా: గత వర్షా కాలంలో సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి ఈ వేసవిలో సాగు,తాగు నీరుకు తీవ్ర కటకట ఏర్పడిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం తండా వాసులు గుక్కెడు నీళ్ల కోసం మైళ్ళ దూరం నడిచి వెళ్లి బిందెలతో నీళ్లను తెచ్చుకుంటూ అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండిపోతున్న గొంతులను తడుపుకునేందుకు పెద్దలు, చిన్నలు కిలోమీటరు దూరం వెళ్ళి బిందెలు మోసుకుంటూ అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.
ఏప్రిల్,మే నెలల్లో ఎండ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడంతో మంచినీటి కోసం అనేక ఇక్కట్లు పడ్డామని,గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నా మా గ్రామానికి మాత్రం మంచినీటి సరఫరా లేకుండా పోయిందని అంటున్నారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు నీటి ఎద్దడిని అధిగమించి,నీటి కొరత లేకుండా చూసినప్పటికీ, మా తండా ప్రజలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని,ఇప్పటికీ మంచినీళ్లు కొరకు అవస్థలు పడుతున్నామని,ఈ విషయం అధికారులకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత మిషన్ భగీరథ అధికారులు స్పందించి పాలవరం తండాలో పర్యటించి మంచినీటి కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.