సూర్యాపేట జిల్లా:మహనీయుల వీరోచిత పోరాటం వారి త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని,మహనీయుల త్యాగాలు గొప్పవని,వారి ఆదర్శాలను మనమంతా ఆచరణలో పెట్టాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ అన్నారు.75వ స్వతంత్య్ర భారతావని వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ నుంచి సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ వరకు 200ల మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన భారీ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు.స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేలా వారి పోరాట పటిమను నేటి తరానికి గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తుందన్నారు.15 రోజుల పాటు నిర్వహించే ఈ విజయోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ జాతీయత స్ఫూర్తిని పెంపొందిస్తున్నామన్నారు.స్వతంత్య్ర ఉద్యమ చరిత్ర పై నేటి యువతకు అవగాహన ఎంతో అవసరమని అన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ప్రజలు ఆశించిన స్వాతంత్య్ర ఫలాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని అన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శాంతియుత వాతావరణంలో సూర్యాపేట జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని దానికి కారణం మంత్రి జగదీష్ రెడ్డి అని అన్నారు.
ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర భావనతో ఉంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న భారతావని వజ్రోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.అనంతరం నిర్వహించిన ర్యాలీలో జాతీయ వాదం వెల్లివిరిసేలా పట్టణంలో ప్రధాన వీధులగుండా ప్రతి ఒక్కరు జాతీయ జెండా చేతబూని జై కిసాన్ జై జవాన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్,డీఎస్పీ నాగభూషణం,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్,మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత,ఆర్డీవో రాజేంద్రకుమార్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ రామ్మూర్తి,వివిధ శాఖల అధికారులు సిబ్బంది, ఆయా వార్డుల కౌన్సిలర్లు అధికారులు,మెప్మా ఆర్పీలు ఆశలు,అంగన్వాడీ టీచర్లు,ఆయా పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.