సూర్యాపేట జిల్లా: నేటి సమాజంలో ఆటో అనేది ప్రతి సామాన్యుడి రథమని,ఆటో డ్రైవర్లు వారి వృత్తిని గౌరవించి, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ,ప్రతి ఒక్కరినీ సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని సూర్యాపేట డిఎస్పీ జి.రవి అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలో స్థానిక పబ్లిన్ క్లబ్ నందు ఆటో డ్రైవర్లకు పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ సాయిరాం,పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ, నిబంధనలు,మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలకు చట్టపరమైన అన్ని అనుమతులు,డ్రైవర్ లైసెన్స్,ఇస్యూరెన్స్ కలిగి ఉండాలన్నారు.
నిబంధనల మేరకు డ్రైవర్ యూనిఫామ్ ధరించాలని, రోడ్లపై ఇతరులకు ఇబ్బంది కలిగించవొద్దని, ఎక్కడపడితే అక్కడ ఆటోలు నిలపకుండా బాధ్యతగా నడుచుకోవాలన్నారు.ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తే ఆటో సీజ్ చేయడం జరుగుతుందని,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, సరదాకు ఆటోలు నడిపే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాఠశాల, కళాశాల విద్యార్థినిలను తీసుకెళ్లే వారు విద్యార్థినిలను సురక్షితంగా గమ్యానికి చేర్చాలని,కొత్త చట్టాలలో రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన నేరంగా పరిగణిఇస్తున్నారని, ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అక్కడే వదిలేయకుండా తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని, క్షతగాత్రులను ప్రమాదం స్థలంలో వదిలేసి పారిపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
కాలం చెల్లిన ఆటోలను రోడ్ల పైకి తీసుకురావొద్దని,వాతావరణ కాలుష్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానిత వ్యక్తులు ఆటోలో ప్రయాణిస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, సమాజంలో నష్టం కలిగించే గంజాయి, గుట్కా,ఇతర నిషేధిత వస్తువులు,నకిలీ సరుకులు రవాణా చేయవొద్దని సూచించారు.
ప్రయాణిస్తున్న వారు విలువైన వస్తువులు, బ్యాగులు,ఏ వస్తువులు మర్చిపోయినా వారికి లేదా పోలీసు వారికి అప్పగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు,ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.