సూర్యాపేట జిల్లా: మణిపూర్ రాష్ట్రంలో కుకీ, నాగ ఆదివాసి మహిళలపై అత్యంత అమానుషంగా దాడి చేసి,నగ్నంగా ఊరేగింపు చేసి, అత్యాచారం చేసి,హత్య చేసిన నిందితులను బైరాన్ సింగ్, మోడీ ప్రభుత్వలు కఠినంగా శిక్షించకుండా కాపాడేందుకు దుర్మరంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద పి.డి.ఎస్.యు, పి.వై.ఎల్,పి.ఓ.డబ్ల్యూ, ఏఐకేఎంఎస్,ఐ.ఎఫ్.టి యు,అరుణోదయ సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా ప్ల కార్డ్స్ చేతపట్టి,నల్లరిబ్బన్లు తలలకు ధరించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్ లో గత మూడు నెలల నుండి మైతేయి వర్గానికి చెందిన వారు కుకీ, నాగలపై దమనకాండను కొనసాగిస్తుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం,సీఎం బైరాన్ సింగ్ ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని మూడు తెగల మధ్య జరుగుతున్న వైరుధ్యాలను తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,ఈ ధోరణి ప్రమాదకరమైందని విమర్శించారు.
మణిపూర్ లో మైదాన ప్రాంతంలో మెజారిటీగా ఉండే మైతేయిలకు బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలంతోనే రాష్ట్ర హైకోర్టు కూడా వారికి ఆదివాసి హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించిందని అన్నారు.అదే విధంగా అటవీ ప్రాంతంలో ఉండే కుకీ, నాగలకు వ్యతిరేకంగా అడవులను రిజర్వు ఫారెస్ట్ గా ప్రకటించి, అడవుల పరిరక్షణ పేరిట కొన్నిచోట్ల ఆదివాసీలను అడవుల నుండి గెంటివేశారని,దీనిని కుకీ,నాగలు తీవ్రంగా వ్యతిరేకించారని,దీనితో ఆ ఘర్షణలు కొనసాగుతున్నా ప్రభుత్వం మైతేయిలకు అనుకూలంగా ఉంటూ మారణహోమాన్ని సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.
మే 4న కుకి,నాగ ఆదివాసి మహిళలపై దాడి చేసి నగ్నంగా ఊరేగింపు చేసి అత్యాచారం చేసిన ఘటన ప్రపంచాన్ని బాధింపజేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.మణిపూర్ లో ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నా మోడీ ప్రభుత్వం కనీసం పార్లమెంట్ లో చర్చించక పోవడం అన్యాయమన్నారు.
మణిపూర్ లో శాంతి భద్రతలను కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకున్నా ఎందుకు నివారించలేకపోతుందని ప్రశ్నించారు.ఆదివాసీల భూములను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,అందులో భాగంగానే మణిపూర్ లో రావణ కాష్టం కొనసాగుతుందన్నారు.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఈ దేశ ప్రజలు అర్థం చేసుకొని తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు,కారింగుల వెంకన్న,పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పోలబోయిన కిరణ్ కుమార్, పివైఎల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నల్గొండ నాగయ్య,ధారావత్ రవి, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు
.