సాధారణంగా వినాయక చవితి రోజు లేదా వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు భక్తులు స్వామివారికి గరిక సమర్పించి స్వామివారి ఎదుట గుంజీళ్లు తీయడం మనం చూస్తుంటాము.అయితే అందరూ గుంజీలు తీస్తున్నారు కాబట్టి మనము తీద్దామని ఉద్దేశంతో గుంజీలు తీస్తారు.
కానీ కేవలం వినాయకుడి ముందు మాత్రమే ఎందుకు అలా గుంజీళ్లు తీస్తారు? అనే విషయం బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు.అయితే అలా గుంజీళ్లు తీయడం ఎందుకు ఆచారంగా మారింది ఇక్కడ తెలుసుకుందాం.
మన పురాణాల ప్రకారం మహావిష్ణువు చెల్లెలు పార్వతీ దేవి అని చెబుతుంటారు.దీని ప్రకారం విష్ణువుకు శివుడు బావ వరుస, వినాయకుడికి మేనమామ వరుస అవుతారు.ఒకరోజు విష్ణుమూర్తి తన బావతో మాట్లాడటం కోసం కైలాస పర్వతానికి చేరుకుంటాడు.కైలాసానికి చేరిన విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని, గదను, ఇంకా తన శరీరంపై ఉన్న ఇతర ఆయుధాలను తీసి పక్కన పెట్టి ఆ శివుడితో మాటలలో నిమగ్నమై ఉంటాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న బాలగణపతి ఎంతో అద్భుతంగా మెరుస్తున్న ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగి తన ఆటలలో నిమగ్నమవుతారు.
శివుడితో మాటలు అనంతరం విష్ణు మూర్తి తన చక్రం ఎక్కడ ఉందో అని గుర్తుకు తెచ్చుకోవడంతో సుదర్శన చక్రాన్ని వెతకడం మొదలు పెడతాడు.ఎంత వెతికినా సుదర్శన చక్రం దొరకకపోవడంతో ఎంతో నీరసించి పోయిన విష్ణుమూర్తిని బాలగణపతి ఏం వెతుకుతున్నావు మామయ్య అంటూ… పలకరించాడు.నా సుదర్శనచక్రం ఎక్కడో పెట్టి మర్చిపోయాను దాని కోసం వెతుకుతున్నానని విష్ణుమూర్తి బాల వినాయకుడితో చెబుతాడు.
అప్పుడు వినాయకుడు సుదర్శన చక్రమా.? ఇంకేక్కడుంది దాన్ని నేను తినేసానుగా అంటూ సమాధానం చెబుతాడు.
బాల గణపతి తనకు మేనల్లుడు కావడంతో విష్ణుమూర్తి ఏమీ చేయలేక ఎలాగైనా తన సుదర్శన చక్రం ఇవ్వాలని వినాయకుని వేడుకుంటాడు.ఈ సుదర్శనచక్రం దుష్టులను సంహరించడానికి ఉపయోగించే ఆయుధం.
ఎలాగైనా బయటకు తీసి ఇవ్వు అని విష్ణుమూర్తి వినాయకుని వేడుకుంటాడు.కానీ వినాయకుడు తన మాటలను పట్టించుకోకుండ నవ్వుతూ ఉంటాడు.
అప్పుడు విష్ణుమూర్తి తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని వినాయకుని ముందు గుంజీలు తీయడం మొదలు పెడతాడు.ఒక్కసారిగా విష్ణుమూర్తి అలా చేయడంతో గణపతికి విచిత్రంగా అనిపించి కడుపుబ్బ గట్టిగా నవ్వుతాడు.
ఇలా నవ్వడంతో లోపల ఉన్న సుదర్శన చక్రం బయట పడుతుంది.అప్పటి నుంచి వినాయకుడు ముందు గుంజీలు తీయడం ఒక ఆచారంగా వస్తోంది.