థైరాయిడ్ క్యాన్సర్( Thyroid cancer ) అనేది థైరాయిడ్ గ్రంధిలో మొదలయ్యే క్యాన్సర్.పురుషులతో పోలిస్తే మహిళలకు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు మూడు రెట్లు ఎక్కువ.
థైరాక్సిన్ హార్మోన్ ను విడుదల చేసే థైరాయిడ్ గ్రంధి మెడ దిగువ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది.ఈ గ్రంధి శరీర జీవక్రియలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
థైరాయిడ్ గ్రంధి మీద గడ్డ లేదా కణితి అపరిమితంగా పెరగడమే థైరాయిడ్ క్యాన్సర్.అసలు థైరాయిడ్ క్యాన్సర్ కు కారణాలేంటి.? దీన్ని ముందుగా గుర్తించడం ఎలా.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్ క్యాన్సర్ మొత్తం ఐదు రకాలు.ఈ జాబితాలో పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్, ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్, హర్టల్ సెల్ క్యాన్సర్, మెడుల్లరీ థైరాయిడ్ క్యాన్సర్, అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నాయి.అయితే దాదాపు 80 శాతం మందిలో పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సరే కనిపిస్తుంది.ఇది ఫోలిక్యులర్ థైరాయిడ్ కణాల నుండి సంభవిస్తుంది మరియు నెమ్మదిగా వృద్ధి చెందుతుంది.అధిక రేడియేషన్ కు బహిర్గతం కావడం, జన్యుపరమైన కారకాలు, కుటుంబ వారసత్వం, అధిక బరువు(
overweight ) లేదా ఊబకాయం, డీఎన్ఏలో మార్పులు, అయోడిన్ తక్కువగా తీసుకోవడం వంటి అంశాలు థైరాయిడ్ క్యాన్సర్ కు కారణం అవుతాయి.

అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే థైరాయిడ్ క్యాన్సర్ ను సులభంగా నయం చేసుకోవచ్చు.థైరాయిడ్ క్యాన్సర్ గురైనప్పుడు మెడ భాగంలో గడ్డ ఏర్పడడం, గొంతు బొంగురు పోవడం, మింగడం కష్టతరం కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నిరంతర దగ్గు, లింఫ్ నాళాల్లో నొప్పి, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.మెడ ప్రాంతంలో ఇటువంటి థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలను అనుభవిస్తుంటే కచ్చితంగా మీరు మంచి థైరాయిడ్ డాక్టర్ ను సంప్రదించాలి.
అల్ట్రాసౌండ్ స్కాన్, నీడిల్ బయాప్సీ పరీక్ష, రేడియో న్యూక్లైడ్ స్కానింగ్, థైరాయిడ్ ఇమేజింగ్, సిటీ స్కాన్ వంటి పరీక్షల ద్వారా థైరాయిడ్ క్యాన్సర్ నిర్ధారణతో పాటు వ్యాధి ఏ దశలో ఉందో, ఎంత వరకు వ్యాపించిందో తెలుసుకోవచ్చు.వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్స పద్ధతులు ఉంటాయి.