ఏడాది లోపు ఎన్ఆర్ఐ సలహా కమిటీని( NRI Advisory Committee ) ఏర్పాటు చేస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) గురువారం తన హామీని నెరవేర్చారు.ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఎన్ఆర్ఐ విధానంపై ఈ కమిటీ సూచనలు ఇస్తుంది.
రెండేళ్ల పదవీకాలం ఉన్న ఈ కమిటీకి రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి డాక్టర్ బీఎం వినోద్ కుమార్( Dr BM Vinod Kumar ) నేతృత్వం వహిస్తారు.ఆయన ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఉంటారు.
గల్ఫ్ మైగ్రేషన్ నిపుణుడు మంద భీమ్ రెడ్డి వైఎస్ ఛైర్మన్‌గా, జీఏడీ ప్రోటోకాల్, ఎన్ఆర్ఐ వింగ్ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
ఇతర సభ్యులలో మాజీ ఎంఎల్‌సీ టీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ధ ఛైర్మన్ ఈ అనిల్ ఉన్నారు.
సింగిరెడ్డి నరేష్‌రెడ్డి, డాక్టర్ లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాసరావు, కొట్టాల సత్యంనార్ గౌడ్, గుగ్గిళ్ల రవిగౌడ్, నంగి దేవేందర్‌రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల వంటి క్షేత్రస్థాయి అనుభవం ఉన్న గల్ఫ్ వలస కార్మిక నాయకులు కూడా కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.

గతేడాది ఏప్రిల్ 16న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్‌లో గల్ఫ్ యూనియన్ల( Gulf Unions ) ప్రతినిధులతో సమావేశం జరిగింది.ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.రేవంత్ రెడ్డి నియమించిన కమిటీ గల్ఫ్, ఇతర దేశాలలో తక్కువ ఆదాయం కలిగిన తెలంగాణ వలస కార్మికులకు అందుబాటులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలను పరిశీలిస్తుంది.

ఈ కమిటీ కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రేదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా దేశంలోని పలు రాష్ట్రాలలో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను అధ్యయనం చేస్తుంది.వలస కార్మికుల సమస్యలను అర్ధం చేసుకోవడానికి, పరిష్కరాలను కనుగొనడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శించనుంది.ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర ఎన్ఆర్ఐ విధానాన్ని ప్రవేశపెడుతుంది.దీనికి అదనంగా తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనుంది.