రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో( Russia-Ukraine War ) మరో తీవ్ర ఘటన చోటుచేసుకుంది.రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగా భారత వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు చేసింది.
శనివారం జరిగిన ఓ వైమానిక దాడిలో, ఉక్రెయిన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘కుసుమ్’ ( Kusum ) అనే భారత ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన గిడ్డంగి (వేర్‌హౌస్) పూర్తిగా ధ్వంసమైంది.
ఈ విషయాన్ని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వెల్లడించింది.రష్యా ప్రయోగించిన క్షిపణి కారణంగానే ఈ గిడ్డంగి( Warehouse ) నాశనమైందని, అందులో నిల్వ ఉంచిన మందులు పిల్లలు, వృద్ధుల కోసమని ఆవేదన వ్యక్తం చేసింది.“భారత్‌తో( India ) ‘ప్రత్యేక స్నేహం’ అని ఓవైపు చెబుతూనే, మాస్కో (రష్యా) ఉద్దేశపూర్వకంగా భారత వ్యాపారాలను టార్గెట్ చేస్తోంది.
పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన మందులను నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తోంది” అని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా, ఈ పోస్ట్‌ను ఉక్రెయిన్‌లోని బ్రిటిష్ రాయబారి మార్టిన్ హారిస్ ( Martin Harris ) షేర్ చేసిన సందేశానికి ప్రత్యుత్తరంగా ఉక్రెయిన్ ఎంబసీ పెట్టింది.

అసలు విషయం ఏంటంటే, రష్యా డ్రోన్లు కీవ్‌లోని( Kyiv ) ఓ పెద్ద ఫార్మాస్యూటికల్ గిడ్డంగిని ధ్వంసం చేశాయని హారిస్ ముందుగా తెలిపారు.వృద్ధులు, పిల్లల వంటి వారికి అత్యవసరమైన మందుల నిల్వలు ఈ దాడిలో తుడిచిపెట్టుకుపోయాయని ఆయన పేర్కొన్నారు.అయితే, ఆ గిడ్డంగి భారత కంపెనీ ‘కుసుమ్’కు చెందినదా అని ఆయన ధృవీకరించలేదు.అంతేకాదు, దాడికి కారణం క్షిపణులు కాదని, డ్రోన్లు అని ఆయన చెప్పడం గమనార్హం.
ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిందని చెప్పబడుతున్న ఒప్పందం ప్రకారం, ఉక్రెయిన్, రష్యాలు ఒకరి ఇంధన వసతులపై దాడులు ఆపడానికి అంగీకరించాయి.అయితే, ఈ ఒప్పందాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారంటూ ఇరు దేశాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
సరిగ్గా ఈ గిడ్డంగిపై దాడి జరిగిన రోజే, ఉక్రెయిన్ తమ ఐదు ఇంధన కేంద్రాలపై దాడులు చేసిందని రష్యా ఆరోపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఈ దాడి జరిగిన సమయంలోనే, ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో జరిగిన ‘అంటాల్యా డిప్లమసీ ఫోరమ్’ ( Antalya Diplomacy Forum ) కు హాజరయ్యారు.అక్కడా కాల్పుల విరమణ ఉల్లంఘనలపై పరస్పరం కొత్త ఆరోపణలు గుప్పించుకున్నారు.అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ( Steve Witkoff ), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ల మధ్య సమావేశం జరిగిన తర్వాత ఈ ఫోరమ్ జరిగింది.మరోవైపు, ఉక్రెయిన్ రక్షణకు యూరోపియన్ దేశాలు బిలియన్ల డాలర్ల అదనపు సహాయాన్ని ప్రకటించాయి.
2022, ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఈ భీకర యుద్ధం మొదలైంది.తూర్పు ఉక్రెయిన్‌లో రష్యన్ మాట్లాడే ప్రాంతాలను కాపాడుకోవడానికి, నాటో (NATO) విస్తరణను అడ్డుకోవడానికే ఈ ‘ప్రత్యేక సైనిక చర్య’ అని రష్యా చెప్పుకుంటోంది.ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లారు.