సూర్యాపేట జిల్లా:వైద్య రంగంలో వైద్యులతో సరి సమానంగా నర్సింగ్ వృత్తి రాణిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు.ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నర్సుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై జ్యోతిని ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ నర్సింగ్ వృత్తికి మరే వృత్తి సాటిరాదని,దీర్ఘకాలిక,స్వల్పకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న రోగులను రక్తసంబంధికులు సైతం దూరం పెట్టే తరుణంలో ఎన్నో సాదకబాధకాలకు ఓర్చి సేవలందిస్తున్న వారు నర్సులని కొనియాడారు.
రోగాల బారినపడి దుర్గంధం వస్తున్నా ఖాతరు చెయ్యకుండా అక్కున చేర్చుకునే వారే నర్సులని పేర్కొన్నారు.వైద్యులతో సరి సమానంగా పోటీ పడి వైద్యులు వచ్చేసరికి రోగులను సంసిద్ధం చేయడంలో వారికి వారే సాటి అని కితాబిచ్చారు.
అటువంటి సేవలు అందిస్తున్నందునే కోవిడ్ సమయంలో అవార్డ్ సాధించుకున్నామని గుర్తు చేశారు.వైద్యరంగంలో కీలకమైన నర్సింగ్ వృత్తికి గౌరవాన్ని,హుందాతనాన్ని తీసుకొచ్చిన ఘనత నైటింగేల్ దని చెప్పారు.
అందుకే ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా నర్సుల దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.జిల్లా కేంద్రానికి నర్సింగ్ కళాశాల మంజూరైందని వెల్లడించారు.
అనువైన భవనం లభ్యమైతే ఈ సంవత్సరం నుండే నర్సింగ్ కళాశాల ప్రారంభం కానుందని ప్రకటించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో సూర్యాపేటలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా మారిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు పక్క జిల్లాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు విస్తరించాయని అందులో వైద్యులతో పాటు నర్సుల పాత్ర కుడా శ్లాఘనియమైనదని అభినందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంజూరై నిర్మితమైన మెడికల్ కళాశాల నూతన భవనాన్ని త్వరలోనే ప్రారంభించుకోబోతున్నట్లు తెలిపారు.మనతోటే ప్రారంభమైన మెడికల్ కళాశాలలను పోల్చి చూసినప్పుడు అద్భుతమైన సేవలు అందించడంలో సూర్యాపేట ముందున్నదన్నారు.
అది గుర్తించినందునే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి నూతన భవనాన్ని మంజూరు చేశారని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అంటేనే హడలిపోతున్న రోజుల నుండి వైద్యం కోసం అంటేనే ప్రభుత్వ ఆసుపత్రికి బారులు తీరే రోజులు వచ్చాయన్నారు.
అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు.డెలివరీ అంటేనే సిజేరియన్ గా పేరుబడ్డ పరిస్థితుల నుండి సాధారణ ప్రసవాల డిమాండ్ పెరగడం చూస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యులు,నర్సులు అందిస్తున్న సేవలే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్,స్థానిక జడ్పిటిసి జీడీ భిక్షం,పెనపహాడ్ ఎంపిపి నెమ్మాది భిక్షం,డిఎంహెచ్ఓ కోటా చలం,ఆసుపత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్ రెడ్డి,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్,వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు సుదర్శన్,నర్సులు తదితరులు పాల్గొన్నారు.