సూర్యాపేట జిల్లా: అత్యాశకు పోయిన ఇద్దరు కూలీలు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని గంజాయి అక్రమ రవాణా చేస్తూ కోదాడ పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డ సంఘటన బుధవారం కోదాడలో వెలుగుచూసింది.జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం…ఒడిస్సా రాష్ట్రం కోరాపూర్ జిల్లాకి చెందిన వాసులు గోపి బారిక్,జయసింగ్ దలాయ్ లు ఇరువురు కూలి పని చేసుకుని జీవనం సాగించేవారు.
ఆదాయం సరిపోక గంజాయి అక్రమ రవాణా చేస్తే అధికంగా ఆదాయం వస్తుందని నిర్ణయించుకున్నారు.ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట్ ఏరియా నందు నిషేధిత గంజాయి తక్కువ రేటుకు అమ్ముతున్నందున,అక్కడ తక్కువ రేటుకు గంజాయిని కొని హైదరాబాద్‌లో ఎక్కువ రేటుకు విక్రయించి లాభ పడదామని అనుకున్నారు.
మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఇద్దరూ కలిసి వెయ్యి రూపాయల చొప్పున 20 కిలోల గంజాయి కొని హైదరాబాద్‌లో ఈ గంజాయిని కిలో ఒక్కింటికి 20 వేల రూపాయల చొప్పున అమ్మి మొత్తం నాలుగు లక్షల రూపాయలకు లాభ పడదామనుకుని,బస్సులో కోరాపుట్ నందు బయలుదేరారు.వైజాగ్ మీదుగా వస్తుండగా కోదాడ ఖమ్మం క్రాస్ రోడ్డు దగ్గర వాహనాల తనిఖీలో పోలీసువారికి పట్టుబడినట్లు తెలిపారు.
వీరి వద్దనుండి 20 కిలోల గంజాయి,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐలు నరసింహారావు, నాగ దుర్గాప్రసాద్,ఎస్సైలు సాయి ప్రశాంత్, క్రాంతికుమార్,రాంబాబు,వెంకట్ రెడ్డి,ఇతర సిబ్బందిని కోదాడ డీఎస్‌పీ రఘు,ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించి రివార్డులు అందజేశారు.