సూర్యాపేట జిల్లా: ఆశా వర్కర్లకు నిర్దిష్ట వేతనం రూ.21వేలు ఇచ్చే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని బీఆర్టీయు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, కొత్త బస్టాండ్ ప్లై ఓవర్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు.అనంతరం డిఎం అండ్ హెచ్ఓ ఆఫిస్ వద్దకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి,జిల్లా యూనియన్ గౌరవ అధ్యక్షులు,ఎమ్మెల్యే గాదరి కిషోర్,జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చొరవ తీసుకొని న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.గత 17 ఏళ్లుగా ఆశా కార్యకర్తలు అనేక జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనులను, సర్వేలను,దిగ్విజయం చేయుటలో ఎన్నో కష్టాలు పడుతూ గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు.
కరోనా సమయంలో ఆశాల యొక్క కృషి వెలకట్టలేనిదని, చాలామంది ఆశా కార్యకర్తలు కరోనా బారిన పడీ మరణించిన విషయం తెలియనిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆశాల కుటుంబ ఆర్థిక అవసరాల దృష్టిలో పెట్టుకొని పనికి తగ్గ పారితోషకం కాకుండా నిర్దిష్ట వేతనం అందించాలని,ఉద్యోగ భద్రత మరియు ఆరోగ్య భీమాను కల్పించి,అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం,స్టాప్ నర్స్ ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించి,అకాల మరణం పొందిన ఆశాల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూతరాజు సైదులు, యాతాకుల మధుబాబు, కొండ్ల శ్రీనివాస్,ప్రసాద్, మల్లారెడ్డి,ఆశా యూనియన్ నాయకులు కవిత,అరుణ,విజయలక్ష్మి, కలమ్మ,లక్ష్మీ,కనకమ్మ తదితరులు పాల్గొన్నారు.