తన కొడుకుపై నెల రోజుల క్రితం హత్యాయత్నం జరిగి,ప్రాణాలతో బయటపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ తన కొడుకుకు న్యాయం చేయాలని ఓ తల్లి గురువారం వాటర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే… నడిగూడెం గ్రామానికి చెందిన గుజ్జ ఎల్లయ్యపై కొందరు వ్యక్తులు నెల రోజుల క్రితం హత్యయత్నానికి పాల్పడ్డారు.
తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న బాధితుడు అప్పటి నుంచి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.జరిగిన ఘటనపై ఎల్లయ్య తల్లి గుజ్జ అచ్చమ్మ నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
నెల రోజులు గడిచినా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకుండా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారని ఆవేదనకు గురైన అచ్చమ్మ పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ తన కొడుకుకు న్యాయం చేయాలని నీళ్ల ట్యాంక్ ఎక్కింది.తమకు న్యాయం జరిగేంత వరకు ట్యాంక్ దిగనని భీష్మించుకు కూర్చోవడంతో,ఆమెకు మద్దతుగా స్థానికులు రోడ్డుపై నిరసనకు దిగారు.
పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉండడంతో స్థానిక ఎస్ఐ ఏడుకొండలు జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కిందికి దిగొచ్చింది.దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాజకీయ అండదండలతోనే నిందితులపై చర్యలు తీసుకోడం లేదని,ఇంటికి పెద్ద దిక్కు ఆసుపత్రిలో ఉండటంతో తమ కుటుంబం రోడ్డున పడ్డదని వాపోయారు.ఇప్పటికైనా నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని,లేకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.