సూర్యాపేట జిల్లా: జిల్లాలో హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల అభివృద్ధిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.దశాబ్ద కాలంగా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలను పట్టిపీడిస్తున్న రహాదారుల సమస్యలకు పుల్ స్టాప్ పెట్టడంతో పాటు, అవసరమున్న చోట హై లెవల్ బ్రిడ్జీల నిర్మాణానానికి శ్రీకారం చుట్టారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం సాయంత్రం అభివృద్ది పనుల కోసం రూ.232 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో విడుదల చేయించారు.ముందెన్నడూ లేని రీతిలో ఈ రెండు నియోజకవర్గాలకు ఇంత పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయించి,రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీరెడ్డి దంపతులు అభివృద్ధిలో తమదైన శైలిలో ముందుకు పోతున్నారు.
తమకు ఈ రెండు నియోజకవర్గాలు మాకు రెండు కళ్ళు అని,తమను ఆదరిస్తే అభివృద్ధిలో తీర్చి దిద్దుతామంటూ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మేల్యే పద్మావతీ చేసిన వాగ్దానం అతి తక్కువ కాలంలో అమలులోకి రావడంతో కోదాడ,హుజుర్ నగర్ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.జీఓ నెంబర్ 666 ప్రకారం చేపట్టబోయే పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హుజుర్ నగర్ నుండి మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 24 కి.మీ.7 మీ.వెడల్పు రహదారిని 10 మీ.విస్తరణకు రూ.80 కోట్లు,రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ విస్తరించే ఈ రోడ్డు వలన రవాణా సులభం అవుతుంది.హుజుర్ నగర్ నియోజకవర్గంలో అంతర్గత రహదారులపై పూర్వపు చిన్న చిన్న కల్వర్టులను హై లెవల్ బ్రిడ్జీల మార్చేందుకు రూ.35.9 కోట్లు, మఠంపల్లి-జాన్ పహాడ్ రహదారిలో వరదాపురం చివరన,రాఘవాపురం వద్ద హై లెవల్ బ్రిడ్జిలకు 17.50 కోట్లు,అమరవరం- అలింగాపురం మార్గంలో చెన్నాయిపాలెం వద్ద హై లెవల్ బ్రిడ్జికి రూ.11.50 కోట్లు,గరిడేపల్లి మండలం కీతవారిగూడెం-వెల్దండ గ్రామాల మధ్య తాళ్ల మొలకాపురం చివరన బ్రిడ్జికి రూ.6.90 కోట్లు,
పి.ఆర్ సిమెంట్ ఫ్యాక్టరీ- కిష్టాపురం క్రాస్ రోడ్ వరకు పది కి.మీ.డబుల్ రోడ్ విస్తరణకు రూ.15 కోట్లు, మేళ్లచెరువు-చౌటపల్లి రోడ్డుకు రూ.10 కోట్లు, మేళ్లచెరువు-చింత్రియాల రహదారి విస్తరణకు రూ.10 కోట్లు,తాజాగా విడుదలైన రూ.232 కోట్లలో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ కు రూ.150.90 కోట్లు మంజూరు చేయించారు.అదేవిధంగా ఉత్తమ్ పద్మావతీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గ పరిధిలో కోదాడ పట్టణంలో పూర్వ 9వ,జాతీయ రహదారి 8.4 కి.మీ.రూ.18 కోట్లతో విస్తరణ,పిడబ్ల్యూడి పరిధిలోని రెడ్లకుంట సుమారు 8.4 కి.మీ.రహదారి విస్తరణకు రూ.20 కోట్లు, ఆకుపాముల-రత్నవరం 7.5 కి.మీ.రోడ్డుకు రూ.16 కోట్లు,కూచిపూడి పిడబ్ల్యూడి రోడ్డు 5.2 కి.మీ.రూ.12 కోట్లు, చిలుకూరు-జెర్రిపోతులగూడెం 3 కి.మీ.రూ.8 కోట్లు, తొగర్రాయి-శీతలతండా విస్తరణకు రూ.8 కోట్లు, మొత్తం కోదాడ నియోజకవర్గానికి రూ.82 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రత్యేక జీవో విడుదల చేసింది.