సూర్యాపేట జిల్లా:మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి తెలిపారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్ లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశానికి ఆమె ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ పేద,మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని విమర్శించారు.
దేశంలో పెట్టుబడిదారులకు పన్నుల రేట్లలో ప్రభుత్వ రాయితీలు కల్పిస్తూ,పేద, మధ్యతరగతి వర్గాలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు.బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచిపోషిస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు.
ప్రధాని మోడీ తన అనుచరులైన అదాని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ప్రశ్నించే శక్తులు మీద దాడులు చేయడమే నిదర్శనమన్నారు.
దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అదాని హిండెన్ బర్గ్ వ్యవహారంపై విచారణ పారదర్శకంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినా కేంద్రం పట్టించుకోవట్లేదని అన్నారు.
స్టాక్ మార్కెట్ రంగంలో అదాని షేర్ల ధరల మాయాజాలానికి పాల్పడి షేర్ మార్కెట్ కుప్పకూలిపోయినా ప్రధాని స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మేధావులు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ దేశంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదని వ్యాఖ్యానిస్తున్నారన్నారు.
కులాల,మతాల పేరుతో దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతూ కాలం వెళ్లదీస్తున్న బీజేపీ విధానాలను ప్రతిఘటించటం కోసం సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జాతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద మతోన్మాద విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు.
దేశంలోని ప్రజల హక్కులను,దేశ భవిష్యత్తును కాపాడటం కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు.పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలపై జరిగే పోరాటంలో ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.