ఢిల్లీకి చెందిన జూనియర్ మైఖేల్ అనే కంటెంట్ క్రియేటర్ ఇటీవల రిషికేశ్‌లో చేసిన ఒక పని సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.అతను యూరోపియన్ టూరిస్టులు కొందరు రిషికేశ్ నది ఒడ్డున బికినీలు వేసుకుని రిలాక్స్ అవుతుంటే, వాళ్లకు తెలియకుండా వీడియోలు తీశాడు.
అంతేకాదు, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోయాయి.
కానీ మంచి కారణాల వల్ల కాదు! ఆ అమ్మాయిలకు అసలు విషయం తెలియకుండా వీడియోలు తీయడంపై చాలామంది మండిపడ్డారు.వ్యూస్, ఫాలోవర్స్ కోసం ఆ కంటెంట్ క్రియేటర్ మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరించాడని నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.
ముఖ్యంగా వాళ్లు అలా దుస్తులు వేసుకున్నప్పుడు వీడియోలు తీయడం చాలా అసభ్యకరంగా, వెగటుగా ఉందని విమర్శించారు.

వీడియోలు వెంటనే డిలీట్ చేసినప్పటికీ, స్క్రీన్ షాట్లు, క్లిప్స్ మాత్రం ఇంకా షేర్ అవుతూనే ఉన్నాయి.చాలామంది ఎక్స్ ద్వారా తమ కోపాన్ని వెళ్లగక్కారు.“ఇది స్వచ్ఛమైన వేధింపు” అని ఒకరు కామెంట్ చేస్తే, “మహిళల అనుమతి లేకుండా ఇలా వీడియోలు తీయడం అస్సలు ఒప్పుకోలేం” అని ఇంకొకరు గట్టిగా చెప్పారు.
కొందరు నెటిజన్లు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వీడియోలన్నిటినీ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.కానీ ఇప్పటివరకు అతనిపై ఎలాంటి పోలీస్ కంప్లైంట్ నమోదు కాలేదు.

ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.చాలామంది మహిళలకు మద్దతుగా, కంటెంట్ క్రియేటర్‌ను తిడుతూ కామెంట్లు పెడుతుంటే, కొందరు మాత్రం ఆధ్యాత్మిక ప్రదేశాలైన రిషికేశ్‌లో టూరిస్టులు బికినీలు వేసుకోవచ్చా అని ప్రశ్నించారు.అలాంటి ప్రదేశాల్లో సంప్రదాయబద్ధంగా, హుందాగా దుస్తులు వేసుకోవాలని వాదించారు.
ఇలాంటి చర్యల వల్ల ఉత్తరాఖండ్ పర్యాటక కేంద్రంగా తనకున్న మంచి పేరును పోగొట్టుకుంటుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.“ఇలాంటి బయటి వ్యక్తుల వల్ల విదేశీయులు ఇక్కడికి రావడం మానేస్తారు” అని ఒక నెటిజన్ హెచ్చరించాడు.ఈ విషయం ఇంకా వివాదాస్పదంగానే ఉంది.
చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.







