సూర్యాపేట జిల్లా: చరిత్ర తెలియని వాడు,చేతగాని వాడు తెలంగాణకి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఉదాహరణ రేవంత్ రెడ్డి అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం హైదారాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీఐని అడ్డం పెట్టుకొని,బ్లాక్ మెయిల్ చేసి,డబ్బులు సంపాదించి,అడ్డదారిన ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నించి,కాళ్లు మొక్కి, ఢిల్లీ అధిష్టానం మెప్పు పొంది, అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నావని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి గారూ మీకు నా సూటి ప్రశ్న కేసీఆర్ కున్న అనుభవంలో నీ అనుభవం ఎంత…?
సబ్జెక్టు మీద, పరిపాలన అంశాలపై,ప్రభుత్వ విధి విధానాలపై,మాట్లాడే నాలెడ్జ్ లేక,ప్రతిరోజూ అహంకారపూరితంగా వ్యవహరిస్తూ,వ్యక్తిగత దూషణలకు దిగుతున్నావని మండిపడ్డారు.నీకు చేతనైతే, నువ్వు మాట్లాడాల్సింది సబ్జెక్టు మీద,ప్రభుత్వ పాలసీలపై అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు,420 హామీల అమలు చేయడం చేతగాక, వ్యక్తిగతంగా దుర్బాషలాడడం, బూతులు తిడుతూ ప్రజల దృష్టి మరల్చి,డైవర్షన్ రాజకీయాలకు తెరలేపి బొక్క బోర్లా పడడం కాంగ్రెస్ కు పరిపాటైందన్నారు.ఈ రోజు ప్రజల మధ్యకు పోలీస్ బలగాలు లేకుండా రాలేని దుస్థితి నీదని,అందుకు సాక్ష్యం మూసీ పాదయాత్ర అని ఎద్దేవా చేశారు.