సూర్యాపేట జిల్లా: వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి,రోగి పరిస్థితి విషమంగా మారడానికి కారణమైన కోదాడలోని మెడికేర్ ప్రైవేట్ ఆసుపత్రికి గురువారం వినియోగదారుల కమీషన్ భారీ జరిమానా విధించింది.సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన వాసా సాయిలక్ష్మి ప్రసవం నిమిత్తం 2016 మే 16న కోదాడలోని మెడికేర్ ఆసుపత్రిలో చేరింది.
శస్త్రచికిత్స సమయంలో వైద్యులు కడుపు కండరాలను కత్తిరించడంతో ఆమెకు కడుపునొప్పి రావటంతో పాటు తీవ్ర రక్తస్రావం అయింది.అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ లేదా ఖమ్మం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
ఆమె బంధువులు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది.అయితే సాయిలక్ష్మి ఆ స్థితికి వెళ్లడానికి శస్త్ర చికిత్స సమయంలో వైద్యుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
దాంతో డిశ్చార్జి అయిన తర్వాత సాయిలక్ష్మి 2017లో నల్గొండ జిల్లా కోర్టులో వినియోగదారుల కమీషన్‌ను ఆశ్రయించింది.సుమారు ఆరేళ్లపాటు కోర్టులో వాదోపవాదాలు జరగగా గురువారం కమీషన్ తీర్పునిచ్చింది.మెడికేర్ ఆసుపత్రి వైద్యులు గౌరీనాథ్,నిర్మల, మాధురిలు సాయిలక్ష్మికి రూ.15 లక్షల పారితోషికాన్ని 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, కోర్టు ఖర్చులు కింద మరో రూ.20 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.