సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నూతన వ్యవసాయ మార్కెట్ లో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు ధర్నాకు దిగారు.దీనితో మార్కెట్ కమిటీ అధికారులకు, రైతులకు పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇంత జరుగుతున్నా రైతుకు అండగా నిలవాల్సిన అధికార పార్టీ నేతలు రైతులపై జులుం ప్రదర్శించారు.ఆ దృశ్యాలను కెమెరాలతో కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేస్తూ,సెల్ ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.అయినా శాంతించని రైతులు తమకు మద్దతు ధర ఇవ్వాల్సిందేనని జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు.
అన్నదాతల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వ పెద్దలు మార్కెట్ కు వచ్చి చూడాలని,అనేక రకాల పేచీలు పెట్టి క్వింటాల్ కి రూ.1300 నుండి రూ.1500 ధర నిర్ణయించి రైతును నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదేంటని అడిగితే రైతులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనకు కాంగ్రేస్, సీపీఎం,అంబేద్కర్ వాదీ కోమలి అంబేద్కర్ తదితరులు సంఘీభావం తెలిపారు.